మిగిలింది నిరాశే...!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మూడు రోజులగా ఎదురుచూసిన తుపాను బాధితులకు చంద్రబాబు పర్యటన నిరాశ పరిచింది. ఆయనొచ్చి మేలు చేస్తాడని ఆశపడిన బాధితులకు ఒరిగిందేమి లేకుండాపోయింది. బాధితులు తమగోడును చెప్పుకోలేకపోయారు. ఆ అవకాశాన్ని చంద్రబాబు కల్పించలేదు ముఖ్యంగా దిబ్బలపాలెం గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి చెందారు. మూడు రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన చంద్రబాబు పర్యటన ఎట్టకేలకు బుధవారం జరిగింది. భోగాపురం మండలం దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో పర్యటించారు. అయితే ఆయన వస్తారని.... పెద్దఎత్తున నష్టపోయిన కొబ్బరి, అరటి పంటకు సరైన పరిహారం ప్రకటిస్తారని దిబ్బలపాలెం రైతులు ఆశతో ఎదురుచూశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 2.26 నిమిషాలకు వచ్చారు.
అంతవరకు ఎండలోనే గ్రామస్తులు అంతా పడిగాపులు కాశారు. పోని వచ్చిన తరువాత అయినా చంద్రబాబు సంతోషపర్చారంటే అదీ లేదు. నష్టపోయిన కొబ్బరి, అరటి పంటను పొలాల్లోకి వెళ్లి చూసేందుకు బాబు ఆసక్తి చూప లేదు. గ్రామంలో ఉన్న గట్టు నుంచే చూసేసి మైకును అందుకున్నారు. బాధితులకు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా అన్నీ చూసుకుంటానని.. అన్నీ చేసేస్తానని ఏకపక్షంగా చెప్పుకొచ్చారు. బాధితుల గోడును వినేందుకు ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు. అయినప్పటికీ కొంతమంది తమకు జరిగిన నష్టాన్ని చెప్పేందుకు ప్రయత్నించినప్పుడు పూర్తిస్థాయిలో వినకుండా ఆ...అనేసి అన్నీ నేను చూసుకుం టానని మీరేమి భయపడొద్దని దాట వేసి 10 నిముషాల్లోనే పర్యటనను మమ అనిపించేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గుర య్యారు.
తామేమి చెప్పకుండానే అంతా చేసేస్తానని, చూసేస్తానని చంద్రబాబు అంటే ఎవ్వరేం చేయగలరని స్థానికులు వాపోయారు. పడిపోయిన కొబ్బరి చెట్టుకు రూ.1000 పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు చేతులు దులుపుకుంటే ఎలా అని.. ఆ చెట్టును తొల గించడానికే ప్రభుత్వం ఇచ్చిన సాయం సరిపోతుందని తమకు నష్ట నివారణ జరిగేది ఎలా అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విష యాన్ని చె ప్పుకుందామంటే చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. తమకు మొత్తానికి ఐదారు గంటలుగా వేచి ఉన్న చంద్రబాబు పర్యటన కేవలం 10 నిముషాల్లో ముగియడం దానికంత ఏర్పాట్లు, అధికారుల హైరానా అవసరమా అని పలువురు పెదవి విరిచారు. అనంతరం ముక్కాం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో పలువురితో మాట్లాడే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా ముంజేరులో కొంతమంది చంద్రబాబు కాన్వాయిని ఆపి తమ గోడును వినాలని మొరపెట్టుకున్నారు. దీంతో స్థానికుల గోడు విన్న తరువాత చంద్రబాబు స్పందిస్తుండగా వెనుక నుంచి ఒక వ్యక్తి ‘మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలంటూ గ ట్టిగా అన్నాడు’ ఇది విన్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వు పిల్లకుంకవు.. నాకు చెప్పినంతతోడివా...ఎక్కువ మాట్లాడుతున్నావ్... ఊరు కో అంటూ ఘాటుగా మాట్లాడారు. బాధితుల ఆవేదనను పాజిటివ్‌గా తీసుకోవాల్సిన చంద్రబాబు సీరియస్‌గా మాట్లాడడంపై స్థానికులు కాసింత అసహనం వ్యక్తం చేశారు. ముక్కాం చేరుకున్నాక మత్స్యకారులతో మాట్లాడి వారికి అందించే సాయాన్ని ప్రకటించి మృతుల కుటుంబీకులకు పరిహారాన్ని అందజేసి మమ అనిపించేశారు.