బాబు బస్సు యూత్రను అడ్డుకోండి
Published Thu, Aug 22 2013 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
చింతలపూడి, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మ గౌరవ యాత్రను సమైక్య వాదులు అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు బుధవారం ఆమరణ దీక్ష చేపట్టారు. జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్‌లు రాజారావుకు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
బాలరాజు మాట్లాడుతూ మామకు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి బయలు దేరుతున్నారన్నారు. విచ్ఛిన్నకర శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తుంటే వారికి కాంగ్రెస్, టీడీపీలు సహకరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఆత్మగౌరవ యూత్ర చేపడతారని ప్రశ్నించారు. జెండా, అజండాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర సమైక్యత కోసం ముందుకు రావాలని కోరారు. రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలను కుంటున్న కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాజారావుతో పాటు నత్తా రవి, కె. అప్పారావు, పిళ్లా మహాలక్ష్మి ఆమరణ దీక్ష చేపట్టారు. బూసి నాగు, దేవరపల్లి నాగరాజు రిలే దీక్ష చేశారు.
శిబిరంలో మండల కన్వీనర్ టి. వెంకట్రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పి. వినోద్‌రెడ్డి, సీహెచ్ ఖాదర్‌బాబు, టీడబ్ల్యూ జయరాజు, పంచాయతీ సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, పార్టీ నాయకులు టి. చంద్రశేఖర్‌రెడ్డి, డి. ప్రభాకర్, డి. వెంకన్న, కె. రాజారత్నం , ఎస్. కాంతారావు, కె. రవి, జి. ఏసు, వెంకటేశ్వరరావు, కె. శ్రీనివాసరావు, ఎండీ రవూఫ్, మారిశెట్టి సత్యనారాయణ, రామిశెట్టి వెంకటేశ్వరరావు, పెరుగు బాబూరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సీనియర్ నాయకులు బలువూరి నరసింహారావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Advertisement