డబ్బులిస్తూ దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలుండవా?
‘యువభేరి’లో నిలదీసిన విద్యార్థిని
గుంటూరు: ‘‘ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోతే అతడిని ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఒక విద్యార్థి పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే అతడిని డిబార్ చేస్తారు. మరి సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఓటుకు కోట్లు’ కేసులో సాక్ష్యాలతో సహా దొరికిపోతే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ వైఎస్సార్‌సీపీ గురువారం గుంటూరులో నిర్వహించిన యువభేరిలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని శ్రీవిద్య సంధించిన ప్రశ్న ఇది.
యువభేరి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు మైక్ ఇచ్చి మాట్లాడించారు. వివిధ అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, ప్రత్యేక హోదా పోరాటం, ఓటుకు కోట్లు కేసు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ఆంక్షలు తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని తేల్చిచెప్పారు. హోదా కోసం పోరాడేవారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. హోదా ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.