సాక్షి, అమరావతి: సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాటేమోగానీ.. కమీషన్‌లు వసూలు చేసుకోవడంలో మాత్రం సీఎం చంద్రబాబు ఆరితేరిపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జలవనరుల శాఖ నుంచి రహదారులు, భవనాల శాఖ వరకూ అన్ని శాఖల పరిధిలో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి పర్సంటేజీలు తీసుకోవడం.. దుబారా ఖర్చులతో రాష్ట్ర ఖజానాను గుల్ల చేశారు. గత నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపునకు ఏ నెలకు ఆ నెల చేబదుళ్లు(ఓవర్ డ్రాఫ్ట్) చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వివిధ శాఖల పరిధిలో చేసిన పనులు, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు రూ.12 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కొరతను సాకుగా చూపి బిల్లులు చెల్లించడానికి పీఏవో(పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు) అధికారులు నిరాకరిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. కమీషన్‌లు ఇచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించేలా పీఏవోలకు తన కార్యాలయం(సీఎంవో) నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. దీనిపై నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం పెరిగినా ఆర్థిక ఇబ్బందులేనా?
ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.600 కోట్ల మేర ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిపడింది. ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపేయడంతో లబ్ధిదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబోదిబోమంటున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి ఖజానాకు రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.30,390.62 కోట్ల ఆదాయం వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.34,890 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.4,500 కోట్ల మేర అధికంగా ఆదాయం వచ్చినట్లు స్పష్టమవుతోంది. అవినీతి అక్రమాలకు తావు లేకుండా, దుబారా ఖర్చు చేయకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండేవి కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
దుబారాతో ఖజానా కుదేలు
కమీషన్‌ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకూ అన్ని పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. ఒక్క జలవనరుల శాఖలోనే 23 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.58,107.86 కోట్ల మేర భారం పడింది. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలు.. ధర్మపోరాట దీక్షల పేరుతో ఒక్కో సభకు రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాలు.. దుబారా ఖర్చు వల్లే రాష్ట్ర ఖజానా కుదేలైపోయిందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఖజానాకు ఆదాయం పెరిగినా.. పన్నుల వాటా కింద కేంద్రం నుంచి యథావిధిగా నిధులు అందుతున్నా.. ప్రభుత్వ పెద్దల కమీషన్‌లకు, దుబారా వ్యయానికి సరిపోవడం లేదు. దాంతో గత నాలుగు నెలలుగా చేబదుళ్లతోనే నెట్టుకొస్తున్నారు. చేబదుళ్లు రూ.2 వేల కోట్లకు పైగా చేరుకున్నాయి.
కోటరీ కాంట్రాక్టర్లకే బిల్లులు
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెన్షన్ పోగా మిగిలే నిధులను సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన బిల్లులను పీఏవోలు చెల్లిస్తారు. ఆర్థిక పరిస్థితి దిగజారడాన్ని ఆసరాగా చేసుకున్న సీఎం చంద్రబాబు.. సీఎంవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారికి మాత్రమే బిల్లులు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారు. సాగునీటి ప్రాజెక్టులు, రాజధానిలో రహదారుల పనులు చేస్తున్న కోటరీ కాంట్రాక్టర్లలో తాను అడిగినంత కమీషన్‌లు ఇచ్చే వారికి మాత్రమే బిల్లులు చెల్లించేలా పీఏవోలకు ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతున్నారు. గత నాలుగు నెలలుగా చంద్రబాబు కోటరీలోని ముగ్గురు కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తుండటమే ఇందుకు తార్కాణం. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. దాంతో గత రెండు నెలలుగా పిల్లలకు పాలు, గుడ్లు కూడా అందించలేని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment