• పంటల్లో అధిక దిగుబడి, ఉత్పాదకత పెంపునకు చర్యలు రబీలో 860 హెక్టార్లలో అమలు రూ.43 లక్షలకు గాను రూ.39.50 లక్షల ఖర్చు వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ
ఒంగోలు టూటౌన్: జిల్లాలో చంద్రన్న రైతు క్షేత్రాల పథకంను 4,200 హెక్టార్లలో అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ జె .మురళీకృష్ణ తెలిపారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో చంద్రన్న రైతు క్షేత్రాల పథకం గురించి శనివారం ‘సాక్షి’కి వివరించారు. వివిధ పంటల్లో అధిక దిగుబడి, ఉత్పాదకత, ఉత్పత్తి, విస్తీర్ణం పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ పథకంను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గ్రామానికి పది హెక్టార్ల లక్ష్యం కాగా.. 10 హెక్టార్లకు ఒక ప్రదర్శనా క్షేత్రం ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. 33 శాతంపై మేలు రకాల విత్తనాలు, జిప్సం, జింక్, వేపనూనె, వేపపిండి, సస్యరక్షణ మందులను సరఫరా చేస్తారని తెలిపారు. ఒక్కొక్క హెక్టారుకు రూ.5 వేల విలువైన ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ విస్తరణాధికారి, ఏవో, ఏడీఏ, ఎంపీఈవో ఒక్కొక్కరూ ఒక్కో ప్రదర్శనా క్షేత్రం చేయాల్సి ఉంటుందని తెలిపారు.
జిల్లా మొత్తం మీద 420 ప్రదర్శనా క్షేత్రాలు లక్ష్యమన్నారు. ప్రస్తుతం రబీలో 860 హెక్టార్లలో ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. సాగు చేసిన పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులకు రైతు శిక్షణ కార్యక్రమాలు, మేలైన యాజమాన్యం, పథకం వివరాలను డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు రూ.43 లక్షలు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.39.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు.
4,200 హెక్టార్లలో చంద్రన్న రైతు క్షేత్రాలు
Published Sun, Feb 7 2016 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement
Advertisement