అనంతపురం టౌన్: చంద్రన్న పెళ్లి కానుకకు గ్రహణం పట్టింది. బడుగు, బలహీన వర్గాల తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ 20, 2018లో ఈ పథకం రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ప్రచార ఆర్భాటమే తప్పిస్తే.. ఆచరణలో చిత్తశుద్ధి కొరవడింది. పెళ్లిళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కానుకలు అందని లబ్ధిదారుల సంఖ్య వెయ్యికి పైమాటే. విచారణ పేరిట జాప్యం.. వివాహ ధ్రువీకరణ పత్రం అందక నవ వధూవరులు కానుక కోసం నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 7వేల మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇప్పటికే 6,397 మంది వివాహం చేసుకున్నారు. అయితే అధికారులు మాత్రం సుమారు 5వేల మందికి మాత్రమే కానుకను వివిధ దశల్లో మంజూరు చేశారు.విచారణలో జాప్యం: చంద్రన్న పెళ్లికానుక దరఖాస్తు లవిచారణలో అధికారులు జాప్యం చేస్తుండడం లబ్ధిదారులకు శాపంగా మారింది. జిల్లావ్యాప్తంగా 1,345 మంది వధూవరులు కానుక కోసం నిరీక్షిస్తున్నారు. పెళ్లికానుక జాప్యంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సిబ్బంది ఏ స్థాయిలో పని చేస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది. చంద్రన్న పెళ్లికానుక వివరాలను నమోదు చేయడంతో పాటు వధూవరుల ధ్రువీకరణ పత్రాలను వెరిఫికేషన్ చేసి ధ్రువీకరించేందుకు మండలానికి ఇద్దరు చొప్పన 126 మంది కళ్యాణ మిత్రలను నియమించారు. మెప్మా కింద 50 మందికి పైగా సిబ్బందిని కేటాయించారు. అయినప్పటికీ విచారణ నత్తనడకన సాగుతుండటం విమర్శలకు తావిస్తోంది.
సకాలంలో అందని వివాహ ధ్రువీకరణ పత్రాలు
పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి కానుక అందుకునే వరకు లబ్ధిదారులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో వరుస కరువు నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ భాగం పెళ్లిళ్లను పుణ్యక్షేత్రాలతో పాటు దేవాలయాల వద్ద నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా దేవాలయాలు ఏ పంచాయతీ పరిధిలోకి వస్తే ఆ పంచాయతీ కార్యాలయంలో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండకపోవడం, ఇతరత్రా కారణాలతో సర్టిఫికెట్ల కోసమే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. మొత్తంగా చంద్రన్న పెళ్లి కానుక నూతన వధూవరులకు సకాలంలో అందకపోవడం వల్ల పథకం ఉద్దేశం నీరుగారుతోంది.
చర్యలను వేగవంతం చేశాం
క్లస్టర్ల వారీగా కల్యాణమిత్రలతో సమావేశం నిర్వహించి చంద్రన్న పెళ్లికానుకలు లబ్ధిదారులకు చేరేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నాం. మ్యారేజ్ సర్టిఫికెట్ల జారీలో ఎక్కువ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమే. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.– శ్రీకాంత్, డీఆర్‌డీఏ ఏపీడీ
Comments
Please login to add a commentAdd a comment