కేంద్ర పథకానికి మార్పులతో..సీఎం పేరిట రాష్ట్రంలో శ్రీకారం..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకంలో స్వల్ప మార్పులు చేసి ‘చంద్రన్న బీమా’ పేరుతో రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దేశంలో బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ రూ. 12లు చెల్లిస్తే రెండు లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి ప్రధాన మంత్రి బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర పథకంలో స్వల్పమార్పులు చేసి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అసంఘటిత కార్మికులకు రూ. 5 లక్షల వరకు ఉచిత బీమా అందజేసే ‘చంద్రన్న బీమా’ పథకాన్ని ప్రారంభించనుంది.
ప్రధాన మంత్రి బీమా పథకానికి కార్మికులు చెల్లించాల్సిన రూ. 12 ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడంతో పాటు అదనంగా వారి పేరుతో ఈ పథకం ద్వారా మరో రూ. 3 లక్షలకు రాష్ట్రమే బీమా కల్పిస్తోంది. మరోపక్క ఇప్పటికే రాష్ట్రంలో ఆమ్‌ఆద్మీ పథకంలో బీమా సౌకర్యం పొందుతున్న 24 లక్షల మందిని వచ్చే ఏడాది నుంచి కొత్త పథకం పరిధిలోకి తీసుకొస్తారు. మొత్తంగా ఆగస్టు నుంచి ప్రారంభించే ఈ పథకం ద్వారా దాదాపు కోటి మంది అసంఘటిత కార్మికులకు రూ.ఐదు లక్షల వంతున ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వ పథకానికి చెల్లించాల్సిన డబ్బులు కలుపుకొని ఒక్కొక్కరి పేరిట రూ. 135ల మేర రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థలకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ‘సెర్ప్’ ద్వారా అమలు చేయాలని ఆలోచన సాగుతోంది. ఆ శాఖ కమిషనర్ వరప్రసాద్ శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీ నుంచి పథకం ప్రారంభించాలని కసరత్తు జరుగుతోంది.
కేంద్ర నిధులతో ‘చంద్రన్న బీ(ధీ)మా’
Published Sun, May 22 2016 2:30 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM
Advertisement
Advertisement