చంద్రన్న సంక్రాంతి కానుక డౌటే !
కడప సెవెన్‌రోడ్స్ : సంక్రాంతి పర్వదినానికి ప్రభుత్వం పేదలకు అందించే గిఫ్ట్ సరుకులు సకాలంలో అందుతాయూ అనేది సందేహంగా ఉంది. పండుగ రోజు పిండి వంటలతో పేదల ఇళ్లు ఘుమఘుమ లాడాలని రాష్ట్ర ప్రభుత్వం ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో ఆరు సరుకుల గిఫ్ట్ ప్యాక్‌ను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, సంక్రాంతికి సకాలంలో అందించగలమా? అని పౌరసరఫరాల అధికారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమయం చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. పైగా సంచుల కొరత, ప్యాకింగ్ వంటి సమస్యలు వేధిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా ఉన్నతాధికారులు మాత్రం ఈనెల 6వ తేదీ నుంచి గిఫ్ట్ ప్యాక్‌లను జిల్లాలకు సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామంటున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలిసే ్త ఈ నెల 10వ తేదీ నాటికి గిఫ్ట్ ప్యాక్‌లు జిల్లాకు చేరుకునే అవకాశం ఉంటుందని ఇక్కడి అధికారులు భావిస్తున్నారు.
ఈ నెల 12వ తేదీ నాటికి చౌక ధరల దుకాణాలకు గిఫ్ట్ ప్యాక్‌లు చేరాలని ప్రభుత్వం చెబుతోంది. అలా చేరినపుడే పండుగ సమయానికి ప్రజలకు ప్యాక్‌లు అందజేయడానికి అవకాశం ఉంటుంది. గిఫ్ట్ ప్యాక్‌లో ఒకటైన శనగలను అధికారులు జిల్లా స్థాయిలోనే సేకరించారు.
గిఫ్ట్ ప్యాక్‌లు ఈనెల 10వ తేదీకి జిల్లాకు చేరినప్పటికీ శనగల ప్యాకెట్లను కూడా వాటిలో చేర్చి అన్నీ కలిపి ఒక సంచిలో నింపడానికి సమయం పడుతుందని అంటున్నారు. ప్యాక్ చేసిన కానుకలను మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.
ఆరు సరుకులు ఇవే...
జిల్లాలో బియ్యం కార్డులు 6,14,924, రచ్చబండ కూపన్లు 26,718, అంత్యోదయ అన్న యోజన కార్డులు 59,289, అన్నపూర్ణ కార్డులు 799 వెరసి 7,01,730 ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ఒక గిఫ్ట్ ప్యాక్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో ప్యాక్‌లో అర కిలో కందిపప్పు, కిలో శనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో పామోలిన్, 100 గ్రాముల నెయ్యి ఉంటాయి.