ఆఫర్ అంటూ కుచ్చుటోపీ..
వలిగొండ (నల్లగొండ జిల్లా) : మీరు చాలా కాలంగా మా నెట్‌వర్క్ నెంబర్ వాడుతున్నారు, మీకు మా కంపెనీ ఆఫర్ ప్రకటించిందంటూ.. వచ్చిన ఫోన్ కాల్ నమ్మి ఓ వ్యక్తి చేతి చమురు వదిలించుకున్నాడు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్లకు చెందిన వరికుప్పల ఆగమయ్యకు పది రోజుల క్రితం 911133564001, 911133564044 నెంబర్‌ల నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎన్ని రోజులుగా మా నెట్‌వర్క్ వాడుతున్నారని అవతలివారు అడిగారు. దీంతో ఆగమయ్య.. పది సంవత్సరాలుగా వాడుతున్నానని తెలిపాడు. మీరు చాలా కాలంగా మా నెట్‌వర్క్ వాడుతున్నందున మా నెట్‌వర్క్ కంపెనీ మీకు మంచి ఆఫర్ ప్రకటించిందని తెలిపారు. మీకు సామ్‌సంగ్ సెల్‌ఫోన్, 4జీ మొమరీ కార్డు, రెండు గడియారాలు, 5 వేల విలువ చేసే షాపింగ్ వోచర్లు పది రోజులలో పంపిస్తామని చెప్పారు. అలా చెప్పి ఆగమయ్య పోస్టల్ అడ్రస్ తీసుకున్నారు.
ఈ గిఫ్ట్ ప్యాక్ తీసుకునే సమయంలో ఫోస్టాఫీస్‌లో కేవలం రూ.3 వేలు చెల్లించండని తెలిపారు. గిఫ్ట్‌ప్యాక్ పంపించాం, అందిందా అని తిరిగి సోమ, మంగళవారాలలో 911133564031 నెంబరు నుంచి ఫోన్ చేశారు. వీరి ఫోన్ రావడంతో ఆగమయ్య మంగళవారం గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లాడు. పోస్టాఫీస్‌లో ఆయన పేరున గిఫ్ట్ ప్యాక్ వచ్చి సిద్ధంగా ఉంది. దీంతో వారు చెప్పిందంతా నిజమని నమ్మిన ఆగమయ్య 3 వేలు చెల్లించి గిఫ్ట్ ప్యాక్‌ను అందుకున్నాడు. వెంటనే గ్రామస్తుల ముందు దానిని ఓపెన్ చేసి చూడగా వారు చెప్పింది ఒక్కటి కూడ లేదు. అందులో హనుమాన్ చిన్న విగ్రహం, యంత్రం, దేవుడి ఫోటో, సీడీ క్యాసెట్ మాత్రమే కనిపించాయి. దీంతో ఆగమయ్య పరిస్థితి ఆగంగా మారింది. నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నాడు.