valigonda
-
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ..
-
మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ
సాక్షి, యాదాద్రి భువనగిరి: వలిగొండలో గుండెపోటుకు గురై ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. అక్కడే వాహన తనిఖీలు చేస్తున్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఆమెకి సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ భువనగిరి మండలం మన్నెవారిపంపునకు చెందిన బోయిన వెంకటమ్మ గుర్తించారు. పలువురు ఎస్ఐని అభినందించారు. -
దారుణం: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి
వలిగొండ: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అరూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అరూర్‌కు చెందిన సుద్దాల యాదమ్మ(43)కు సంబంధించిన భూతగాదాలో నరసాయగూడెంకు చెందిన రాజకీయ నాయకుడు తుమ్మల నర్సయ్య కలగజేసుకొని విసిగిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రాత్రి తన ఇంట్లో పురుగు మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే యాదమ్మను 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. -
‘విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తామంతా సంపూర్ణంగా సహకరిస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ప్రకటించారు. గురువారం కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు సహకరించాలని, క్షౌరశాలలను తెరవొద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, స్వయం నియంత్రణ పాటించాలని సూచించారు. క్షురకర్మ అనేది మనుషులకు దగ్గరగా ఉండే చేసే వృత్తి కాబట్టి కరోనా వైరస్ సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, తుమ్ము, స్పర్శ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన నిరుపేద నాయీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెలూన్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేయడంతో పాటు తగినవిధంగా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రకటించిన వ్యక్తిగత రుణాలు, సొసైటీ రుణాలు వెంటనే మంజూరు చేస్తే నాయీ బ్రాహ్మణులను ఆదుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి తెలిపారు. (కరోనా.. 'నడక'యాతన!) కేసు ఎత్తివేయండి లాక్డౌన్ సందర్భంగా నల్లగొండ జిల్లా వలిగొండలో నిరుపేద నాయీ బ్రాహ్మణుడిపై పోలీసులు ఐపీసీ 188 కింద కేసు పెట్టడాన్ని లింగం నాయీ ఖండించారు. ప్రజ్ఞాపురం శేఖర్ అనే వ్యక్తిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసి తెలియక క్షౌరశాలలు తెరిస్తే వారికి అవగాహన కల్పించాలి గానీ, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షురకులను బెదిరించి బలవంతంగా క్షురకర్మ చేయించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ ముగిసేవరకు క్షురకర్మకు దూరంగా ఉండాలని వృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. ఆపత్కాలంలో నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర నాయీ, ఉపాధ్యక్షుడు అనంతయ్య నాయీ, కార్యదర్శి జి. శ్రీనివాస్ నాయీ, అడ్వకేట్ మసాయి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. (కోవిడ్ ఎఫెక్ట్: వారి కోసం ‘క్రౌడ్ ఫండింగ్’) -
మత్స్యగిరీశుడికి మహర్దశ!
సాక్షి, యాదాద్రి: నాలుగున్నర ఫీట్ల ఎత్తుతో మత్స్యం మీద కూర్చున్న లక్ష్మీనరసింహుల ఏకశిలా విగ్రహం..58 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న భారీ క్షేత్రపాలకుడి విగ్రహం.. మహాబలిపురంలో రూపుదిద్దుకుంటున్న జయవిజయులు, గరత్మంతులు, ఉత్సవమూర్తుల విగ్రహాలు.. ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు గుండం మీదుగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, పుష్కరిణి చుట్టూ తూర్పు, దక్షిణ భాగాల్లో విస్తరించనున్న ఆలయం.. ఇలా మరెన్నో అభివృద్ధి పనులతో మత్స్యగిరీశుడి క్షేత్రం నూతన కళ సంతరించుకుంటోంది. వలిగొండ మండలం వేములకొండ గుట్టపై వెలసిన మత్స్యగిరీశుడి ఆలయం జిల్లాలో మరో అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. వాస్తు, ఆగమశాస్త్రం ప్రకారం త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆలోచనల మేరకు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. 2018 విజయదశమి రోజున ఆలయ చైర్మన్, దాతలు, భక్తుల సహకారంతో పనులకు అంకురార్పణ చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకు అనుగుణంగా పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. జరుగుతున్నవి, చేపట్టనున్న పనులు గర్భాలయం వెనుక చేపట్టిన ఉత్సవమూర్తుల ఆలయం, గోపురాల నిర్మాణం పూర్తి కావొచ్చాయి. నాలుగున్నర ఫీట్ల ఎత్తులో మత్స్యం మీద స్వామి,అమ్మవార్లు కూర్చున్న కృష్ణ శిలతో చెక్కిన ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠింనున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో స్వామి,అమ్మవార్ల విగ్రహంతో పాటు జయవిజయులు, గరత్మంతుల విగ్రహాలను తయారు చేయించారు. ఈ విగ్రహాలు సెప్టెంబర్ 5న మత్స్యగిరి కొండపైకి చేరుకోనున్నాయి. ఇప్పటికే నూతన ధ్వజస్తంభం సిద్ధమైంది. దీనికి ఇత్తడి తొడుగు అమర్చనున్నారు. స్వామివారి సేవలు తీసే సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా పుష్కరిణి చుట్టూ తూర్పు, దక్షిణ భాగాల్లో 8 ఫీట్ల మే విస్తరించనున్నారు. ఇందుకోసం దేవస్థానం నిధులను ఖర్చు చేయనున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాలతో సీపీఎస్ పనుల ద్వారా సత్యనారాయణ వ్రత మండపానికి పక్కా భవనం నిర్మించనున్నారు. ధ్వజస్తంభం నుంచి స్వామివారి గర్భాలయం వరకు గుండం మీదుగా ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత చైర్మన్ కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు సమన్వయంతో దాతల సహకారం లభిస్తోంది. కోటి రూపాయల అంచనాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులకు వసతులు కల్పించడం కోసం ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షుడు ఎంతో కృషి చేస్తున్నారు. భారీ ఆంజనేయస్వామి విగ్రహం కొండపైన గల శ్రీసీతారామచంద్రస్వామి, ఆలయం ఎదుట 51 అడుగుల ఎత్తులో ఆంజనేయస్వామి నిలువెత్తు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి సుమారు రూ.20లక్షల సొంత నిధులతో ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని, చుట్టూ భక్తులకు వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంజనేయస్వామి విగ్రహాం తయారీ తుది దశకు చేరుకుంది. త్వరలో ప్రారంభించనున్నారు. 42 ఎకరాల స్థల వితరణ వేములకొండ లక్ష్మీనర్సింహస్వామికి 42ఎకరాల స్థల వితరణ చేశారు. వేములకొండకు చెందిన పారిశ్రామికవేత్త గార్లపాటి సురేందర్‌రెడ్డి జీయర్‌స్వామి సమక్షంలో దేవస్థానానికి 42ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో దేవస్థానం పరిసరాల్లో వసతులు మెరుగుపర్చడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. శని, ఆది, సోమవారాలతోపాటు వీకెండ్ రోజుల్లో 20వేల వరకు భక్తులు వచ్చి వెళ్తున్నారు. నూతన సంవత్సరం, కార్తీకమాసం, శ్రావణమాసం, పుణ్యతిథులైన పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి పర్వదినాల్లో భక్తులు సత్యనారాయణ వ్రతాలు, పుట్టువెంట్రుకలు, స్వామివారికి సమర్పించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకుంటారు. విశిష్టమైనది విష్ణు పుష్కరిణి విష్ణు పుష్కరిణి అత్యంత విశిష్టమైనది. ఈపుష్కరిణిలోనే స్వామివారు వేలిశారని భక్తుల నమ్మకం. ఇందులో నీరు ఎప్పుడు ఇంకిపోతుంది. పుష్కరిణిలోని నీటితోనే స్వామివారిని ప్రతిరోజూ అభిషేకిస్తారు. పుష్కరిణిలో చేపల తలలపై స్వామివారి నామాలు దర్శనమిస్తాయి. దీంతో పుష్కరిణిలోని నీటిని పొలాల్లో చల్లితే పెద్ద ఎత్తున పంటలు పండుతాయని భక్తుల నమ్మకం. ఏటేటా పెరుగుతున్న భక్తులు ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంలో కాలిబాటన కొండపైకి చేరుకునే భక్తులకు ప్రస్తుతం రోడ్డు వసతిని కల్పించారు. కొండపై ముఖ మంటపం, గోదాదేవి ఆల యం, సత్యానారాయణస్వామి వ్రత మంట పం, మూడు అంతస్తుల రాజగోపురం, పంచముఖ రామలింగేశ్వర ఆలయం, యాగశాల, విశ్రాంతి భవనం,షాపింగ్ కాంప్లెక్స్, సత్రాలు, కోనేరు చూట్టు సీసీ రోడ్డు, లడ్దు ప్రసాద విక్రయ శాల, విశ్రాంతి భవనం ఉన్నాయి. రోడ్డుపైకి ఘాట్‌రోడ్డు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దాతలు, భక్తుల సహకారంతో.. త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆలోచనల మేరకు భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. జీయర్‌స్వామి కొండపైన ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా స్వయంభూవుగా వెలసిన లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ రూపం ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారం, తనవంతు ఆర్థిక సహాయంతో గత విజయదశమిన జియర్‌స్వామి ప్రారంభించిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. జియర్‌స్వామి చేతుల మీదుగా స్వామివారి దర్శనం కల్పించబోతున్నాం. –కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ గ్రహ పీడలు తొలగిపోతాయి స్వామివారి తీర్థం స్వీకరించిన భక్తుల శారీ రక గ్రహపీడ బాధలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణు పుష్కరిణిలోని తీర్థంతో ప్రతి నిత్యం స్వామివారికి అభిషేకిస్తాం. భక్తులు ఎవరైనా 11రోజులు ఈవిష్ణు తీర్థాన్ని స్వీకరించినట్లయితే గ్రహదోశం, సంతానప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార వివాహాలు కలుగుతాయని విశ్వాసం. ఈతీర్థాన్ని పంట పొ లాల్లో చల్లితే పాడిపంటలు సమృద్దిగా పండుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. –యాదగిరి స్వామి, అర్చకుడు -
వెంబడించి కారుతో ఢీకొట్టి.. వ్యక్తి దారుణ హత్య
సాక్షి, వలిగొండ (భువనగిరి) : పట్టపగలే ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన వలిగొండ మండలం సంగెం గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్య (62)ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వృతిలో భాగంగా శుక్రవారం కైతపురంలో ఓగ్గు కథ చెప్పి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కారులో వెంబడించి సంగెం గ్రామ సమీపములో ఢీకొట్టారు. దీంతో శంకరయ్య రోడ్డుపక్కన పడిపోవడంతో వెంటనే కొంత మంది దుండగులు కారు దిగి శంకరయ్య మెడ చెవులు కోసి శరీరంపై ఉన్న నగలను తీసుకెళ్లారు. మెడ భాగములో తీవ్ర రక్తస్రావం కావడంతో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అటు వైపు వెళుతున్న వాహనదారులు సమాచారం ఇవ్వడముతో ఎస్సై శివనాగ ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ ఇచ్చిన మాచారం మేరకు డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఘటన స్థలంలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసి ఆధారాలు సేకరించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంగారు ఆభరణాల కోసం హత్య చేశారా..? మరో కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. -
మంత్రి వ్యాఖ్యలపై జనం ఆగ్రహం
సాక్షి, యాదాద్రి : వేములకొండ దుర్ఘటనపై మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యా యి. వేములకొండలో పోస్టుమార్టం జరుగుతున్న పీహెచ్సీ వద్ద మృతుల బంధువులను పరామర్శించా క ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్‌కుమార్‌రెడ్డి, గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆగ్రహించిన మంత్రి.. ‘రూ.15 లక్షలు సరిపోతాయా...? రూ.50 లక్షలు వద్దా?’ అని అనిల్‌తో వ్యంగ్యంగా అనడంతో వివాదం మొదలైంది. ‘మీలాంటి వాళ్లను చాలా మందిని చూశాం. బాధ్యతగా మెలగడం నేర్చుకోండి. శవాల మీద పేలాలు ఏరుతున్నారు. చచ్చినకాడ రాజకీయం చేస్తారా?’ అంటూ ఆందోళన చేస్తున్న వారిపైనా మంత్రి ఆగ్రహించడంతో వివాదం పెద్దదైంది. కాంగ్రెస్ నాయకులను, గ్రామస్తులను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. మృతుల కుటుంబీకులతో చర్చించి రూ.2.5 లక్షల ప్రభుత్వ సాయం, సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, స్థలం లేని వారికి స్థలంతోపాటు ఇల్లు, చదువుకునే పిల్లలుంటే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని అనంతరం మంత్రి చెప్పారు. ఈలోపు గ్రామస్తులు, విపక్ష నేతలు గేటుకు అడ్డంగా బండరాళ్లు పెట్టి ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను బయటకు వెళ్లనీయలేదు. పరిహారం రూ.5 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. మంత్రి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మృతదేహాలను గ్రామానికి పంపారు. రూ.2.50 లక్షలు ప్రభుత్వం నుంచి, మరో లక్ష భువనగిరి ఎమ్మెల్యే నిధులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మంత్రి ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. దీంతో సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతకు తెరపడింది. -
చేతిలో సిగరెట్.. కాళ్ల మధ్య స్టీరింగ్
సాక్షి, యాదాద్రి/వలిగొండ : డ్రైవర్ 60 ఏళ్ల వృద్ధుడు.. లైసెన్స్ లేదు.. గతంలో డ్రైవింగ్ చేసిన అనుభవం అంతకంటే లేదు.. ఇటీవల నేర్చుకొని ట్రాక్టర్ స్టీరింగ్ పట్టాడు.. 30 మందిని ఎక్కించుకున్నాడు.. వీటన్నింటికితోడు అంతులేని నిర్లక్ష్యం.. సిగరెట్ వెలిగించుకునేందుకు స్టీరింగ్‌ను కాళ్లకు అప్పగించాడు.. అంతలోనే చిన్న కుదుపు.. కంట్రోల్ చేసేందుకు బ్రేకు తొక్కాడు.. అయినా అదుపు తప్పింది.. పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి బోల్తా కొట్టింది.. చూస్తుండగానే ట్రాలీ తిరగబడి 15 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! మృతుల్లో 14 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదమిదీ!! బయల్దేరిన ఐదు నిమిషాలకే అమాయకులైన నిరుపేద కూలీలు జలసమాధి అయ్యారు. మరో పది నిమిషాల్లో చేనుకు చేరి పనులు చేసుకునే వారి బతుకులు డ్రైవర్ నిర్లక్ష్యంతో తెల్లారిపోయాయి. ఎలా జరిగిందంటే..? వేములకొండలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని వెంకటనారాయణ మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా సాగుకు సిద్ధమయ్యాడు. ఇటీవల వర్షం కురవడంతో ఆదివారం పత్తి విత్తనాలు వేసేందుకు తన ట్రాక్టర్ఈ ట్రాక్టర్(ఏపీ16 ఏబీ 8775)లోనే లోనే 30 మంది కూలీలను తీసుకుని చేనుకు బయల్దేరాడు. కూలీలకు పంచేందుకు స్వీటు డబ్బా కూడా తీసుకుని వెళ్లాడు. ట్రాక్టర్ ఇంజిన్‌పై వెంకటనారాయణతోపాటు మరో ఐదుగురు కూర్చున్నారు. డ్రైవర్ వెనుక చెక్కపై ముగ్గురు, రెండువైపులా టైర్లపైన ఒక్కొక్కరు చొప్పున కూర్చున్నారు. ఇది పాత మోడల్ ట్రాక్టర్. టైర్లు పూర్తిగా అరిగిపోయాయి. కొంతకాలంగా వాడటం లేదు. కూలీలను తీసుకెళ్లేందుకు ఆదివారమే బయటకు తీశాడు. రెండు బ్రేక్‌లు ఒకేసారి కొడితేనే ట్రాక్టర్ నిలకడగా ఆగుతుంది. ఎడమ, కుడి బ్రేక్‌లలో ఏ ఒక్కదాన్ని నొక్కినా ట్రాక్టర్ అటువైపే లాగుతుంది. కూలీలతో బయల్దేరిన ఐదు నిమిషాలకు సిగరెట్ ముట్టించేందుకు వెంకట నారాయణ రెండు చేతులు విడిచిపెట్టి స్టీరింగ్‌ను రెండు కాళ్ల మధ్య పెట్టి తిప్పాడు. ఇదే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కుడివైపు ఉన్న మూసీ కాల్వ వైపు మళ్లింది. దీంతో డ్రైవర్ కుడి వైపు బ్రేక్ తొక్కడంతో ట్రాక్టర్ ట్రాలీ కూడా అటువైపే ఒరిగింది. అది నల్లరేగడి భూమి కావడం, శుక్రవారం కురిసిన వర్షానికి నానడంతో స్కిడ్ అయి ట్రాలీ కాల్వలో పడిపోయింది. గుర్రపు డెక్క.. పట్టా.. ట్రాక్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి గుర్రపు డెక్క కూడా కారణంగా కనిపిస్తోంది. మూసీ కాల్వ వెంట గుర్రపు డెక్క ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ట్రాలీ తిరగడి పడిపోవడం, అందులోని కూలీలు గుర్రపు డెక్క మధ్య చిక్కుకుపోవడంతో బయటపడే మార్గం మూసుకుపోయింది. అలాగే ట్రాలీలో కూర్చునేందుకు యూరియా బస్తాల పట్టా పరిచారు. కాల్వలో ట్రాక్టర్ పడిపోగానే ఇది కూడా కూలీలపై పడిపోయి ఊపిరి ఆడకుండా చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వెంకటరమణ అక్కడ్నుంచి పారిపోయాడు. మృతులు వీరే.. జడిగె మారమ్మ( 55), ఎనుగుల మాధవి (26), బందారపు స్వరూప (35), పంజాల భాగ్యమ్మ (27), బీసు కవిత (27), కాడిగల్ల లక్ష్మమ్మ (35), మనీషా (18), కాడిగల్ల నర్మద( 25), ఇంజమూరి శంకరమ్మ (30), ఇంజమూరి నర్సమ్మ (50), అంబాల రాములమ్మ(50), అరూరు మణెమ్మ (30), గన్నెబోయిన అండాలు( 35), బోయ శంకుతల(23), మల్లిఖార్జున్ (4). వీరిలో కాడిగల్ల లక్ష్మమ్మ, మనీషాలు తల్లికూతుళ్లు. మృతదేహాలకు వేములకొండలోని పీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించారు. బయటపడిన 15 మంది.. ప్రమాదంలో 15 మంది గాయాలతో బయటపడ్డారు. వారిలో కాడిగల్ల అఖిల, కాడిగల్ల హేమలత, గన్నెబోయిన మంజుల, రత్నకుమారి, జోగు శాంతమ్మ, మట్టిపల్లి లక్ష్మమ్మ, ఇంజమూరి లక్ష్మమ్మ , రాపోలు జయమ్మ, బొంగు లక్ష్మమ్మ, కాడిగల్ల తేజ, అంబుల సోమమ్మ, కోట అనిత, బొంత మంజుల, కాడిగల్ల ఇందిర ఉన్నారు. వీరిని రామన్నపేట, భువనగిరి ఏరియా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఏడాది క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి.. వేములకొండకు చెందిన సుంచు నర్మద (25) భర్త నరేశ్ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెకు మహీదర్(6), అవంతిక(4) సంతానం. గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా శిక్షణ పొందుతోంది. నర్మద సాధారణంగా కూలీకి వెళ్లదు. ఆదివారం రోజు ఇంటి దగ్గర ఉండలేక తన చెల్లి మనీషతో కలసి పత్తి గింజలు పెట్టేందుకోసం వెళ్లింది. ప్రమాదంలో నర్మద మృతి చెందగా, శిరీష ట్రాక్టర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పటికే తండ్రి చనిపోగా, ఇప్పుడు తల్లి మరణించడంతో పిల్లలు మహీదర్(6), అవంతిక అనాథలయ్యారు. అమ్మమ్మ, మేనత్త, పిన్నిల వద్దకు వెళ్లి అమ్మ కావాలంటూ చిన్నారులు ఏడ్వడంతో చూసినవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో పాపం..! చౌటుప్పల్: పొట్ట చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ట్రాక్టర్ ప్రమాదంతో ఛిన్నాభిన్నమైంది. కర్నూలు జిల్లా ఆధోని గ్రామానికి చెందిన బోయ పరశురాం(35).. భార్య శకుంతల(30), నాలుగేళ్ల కుమారుడు మల్లిఖార్జున్‌తో కలిసి 15 రోజుల క్రితం జీవనోపాధి కోసం భువనగిరి జిల్లా వేములకొండకు వచ్చారు. గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇంటి వద్ద కుమారుడి ఆలనాపాలనా చూసే వాళ్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంట తీసుకెళ్తున్నారు. ఆదివారం కూడా ముగ్గురు కలిసి ట్రాక్టర్లో ఎక్కారు. బాలుడు తల్లి ఒడిలో కూర్చోగా పరశురాం ట్రాలీ వెనుక భాగంలో బాడీపై కూర్చున్నాడు. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతిచెందగా పరశురాం ప్రాణాలతో బయటపడ్డాడు. మేమే బయటకు తీశాం ట్రాక్టర్ బోల్తా పడిందని తెలియగానే పరుగున వచ్చాం. 15 మంది చనిపోయారు. వారందరినీ బయటకు తీశాం. మరో ఏడుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. వారిని బయటకు తీసి ఆస్పత్రికి పంపించాం. – ఏర్పుల యాదయ్య, వేములకొండ పట్టా చుట్టేసింది ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో ట్రాలీలో కూర్చున్న మహిళలంతా నీటిలో పడిపోయారు. వారిపై ట్రాలీ పడింది. మహిళలు కూర్చునేందుకు ట్రాలీలో పట్టా ఏర్పాటు చేశారు. అది మహిళలను చుట్టేసింది. లోపల ఉన్న వారు బయటకు రాలేకపోయారు. పైన బçస్తా పట్టా, ఆపై ట్రాలీ ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. – గుడెళ్ల శ్రీహరి, ప్రత్యక్ష సాక్షి ఊపిరాడకే చనిపోయారు: పోస్టుమార్టం నివేదిక ట్రాక్టర్ ప్రమాద మృతుల పోస్టుమార్టం నివేదికను వైద్యులు విడుదల చేశారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే కూలీలంతా చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోట్యానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఛాతీపై బరువు పడడంతో 9 మంది, నీళ్లు మింగి ఆరుగురు చనిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వెంకటనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందే హెచ్చరించిన సాక్షి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాల్వ కట్టలు బలహీనంగా, ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ‘సాక్షి’ముందే హెచ్చరించింది. ఏప్రిల్ 6న పెద్ద అడిశర్లపల్లి మండలం పడమటితండాలో కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని మూసీ, ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కాల్వ కట్టల పరిస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక ఫొటో ఫీచర్ ప్రచురించింది. ఎక్కడెక్కడ ప్రమాదం పొంచి ఉందో వివరించింది. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ్, జానా సంతాపం వేములకొండలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. -
హరితహారాన్ని కొనసాగించాలి
వలిగొండ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం శిథిలావస్థకు చేరి ఖాళీగా ఉన్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో మొక్కను నాటారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలను చేరుకుని విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో వర్షం నీరుతో సహా వృథా కాకుండా చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. హరితహారంలో పెంచుతున్న మొక్కలను చూశారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఆ తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుగుదొడ్లు 100 శాతం పూర్తయ్యేలా, మిషన్ భగీరథను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ మహేందర్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ కుంభం వెంకట్‌పాపిరెడ్డి, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, తహసీల్దార్ అరుణారెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ గిరిబాబు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బు ఉపేందర్, ఉపాధ్యక్షుడు కాసుల కృష్ణ, డాక్టర్ సుమన్‌కల్యాణ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎంఈఓ విజయారావు, ఏపీఓ ఇమ్మానీయేల్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. -
మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట
వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వివిధ వస్తువుల కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడాయి. మెుత్తంగా దేవాలయ పరిసరాలు భక్తులో సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన సిబ్బంది సదుపాయాలు కల్పించారు. -
వలిగొండకు వచ్చిన జగన్
వలిగొండ/చౌటుప్పల్/నకిరేకల్/చిట్యాల: సోమవారం వలిగొండ మండలం మాందాపురంనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డికి ప్రజలు, నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్న వలిగొండ మండలం మాందాపురంనకు చెందిన గూడూరు అశోక్‌రెడ్డి తల్లి యశోధాదేవి(78) ఆదివారం మృతిచెందడంతో సోమవారం అశోక్‌రెడ్డిని జగన్ పరామర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ రోడ్డు మార్గాన మాందాపురంనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యశోధాదేవి మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం అశోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఇరుగుదిండ్ల సునీల్‌కుమార్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, రాష్ట్ర నాయకుడు పడాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్‌గౌడ్, కార్యదర్శి మొలుగు రాములు, మండల అధ్యక్షుడు ఇంజమూరి కిషన్, కన్నె కొండల్రావు, నాయకులు గూడూరు యాదిరెడ్డి, పైళ్ల నర్సిరెడ్డి, బందారపు లింగస్వామి ఉన్నారు. అడుగడుగునా ఘన స్వాగతం ఖమ్మం జిల్లా నుంచి వలిగొండ మండలానికి వచ్చిన జగన్‌కు జిల్లాలోని మోతె, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేటల వద్ద ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజలు, మహిళలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. నకిరేకల్‌లో దేవీ పెట్రోల్ బంక్ వద్ద జగన్‌కు అభిమాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆటోలో అటు వైపుగా వెళ్తుండగా జగన్ చూసిన ప్రజలు, మహిళలు అక్కడికి వచ్చి జగన్‌తో కరచాలనే చేశారు. చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడి ఆప్యాయంగా పలకరించారు. చిట్యాలలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ దిగేందుకు యువకులు పోటీ పడ్డారు. జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె. మహేందర్‌రెడ్డి, మైనారిటి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శిలు కొమిరెళ్లి మోహన్‌రెడ్డి, దేవసరి పాపయ్య, చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి మండల అధ్యక్షులు అంశల సత్యనారాయణ, రుద్రారపు శంకరయ్య, బాసోని నర్సింహా, నాయకులు నాతి మల్లేష్‌గౌడ్, ఎండీ ఫయాజ్, కర్ల సుందర్‌బాబు, మేడి యాదయ్య. ఎండీ సలీం, గిరి, మరియదాసు ఉన్నారు. -
రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం
వలిగొండ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాతాళ్లగూడెంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తే వారి బాధలు సీఎంకు తెలుస్తాయన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పుష్కరాలకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కాల్వలకు రూ.50 కోట్లు కేటాయిస్తే భువనగిరి డివిజన్ సస్యశ్యామలమవుతుందన్నారు. టీఆర్ఎస్ చెబుతున్న ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి దివంగతనేత వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం చేరున చేపట్టినవేనని గుర్తు చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, పల్సం సతీష్, ఉద్దగిరి భాస్కర్, దేశబోయిన సూర్యనారాయణ, సాయిలు, వెంకటేశం ఉన్నారు. -
రైతు ఆత్మహత్య
వలిగొండ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక క్రిమి సంహారక మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..నాతాళ్లగూడెంకు చెందిన నోముల లక్ష్మయ్య (44) అనే రైతు ఇంట్లో ఎవరు లేనిది చూసి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన సమీప బంధువు 108కు సమాచారమిచ్చాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. మృతుడు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయ చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు కుమారుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ భాగ్యనాయక్ కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
వలిగొండ : రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని నాతాళ్లగూడెం శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల సోములు(45), జయమ్మ(40) దంపతులు రామన్నపేట మండలం నీ ర్నెముల గ్రామంలో జరిగిన బొడ్రా యి ప్రతిష్ఠాపన వేడుకలకు వెళ్లారు. పండుగ అనంతరం సాయంత్రం బైక్‌పై తుక్కాపురం బయలుదేరారు. నాతాళ్లగూడెం శివారులో చి ట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్న లా రీ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతిచెం దా రు. వారికి కుమారుడు, కుమార్తె ఉ న్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల వద్ద వారి పిల్లలు రోదిస్తున్న తీరు అం దరినీ కంటతడి పెట్టించింది. -
‘మిషన్ కాకతీయ’లో రెండో స్థానం
వలిగొండ : మొదటి దశ మిషన్ కాకతీయ పనుల్లో రాష్ర్టంలో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. వలిగొండ మండలంలోని లోతుకుంటలో ఊరచెరువు, వెల్వర్తిలో పాపినేని చెరువు పునరుద్ధరణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకం రెండో దశలో జిల్లాలో 843 చెరువులకుగాను 560 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చెరువు పునరుద్ధరణ పనుల్లో రైతుల భాగస్వామ్యం ప్రధానమన్నారు. పూడిక మట్టిని రైతులు పంటచేలలో ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలలో నీటి ఎద్దడి నివారణకు రూ.16 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. వాటిని అద్దె బోర్లకు, పైపులైన్లకు ఉపయోగించి నీటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఐబీ ఎస్ఈ ధర్మ, ఈఈ సుందర్, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, ఏఈ వీరారెడ్డి, తహిసీల్దార్ అరుణారెడ్డి, స్థ్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించాలి.. నల్లగొండ : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలేరు నుంచి మండలస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వ హించారు. జిల్లాలో 756 గ్రామాల్లో 1170 బోర్లను అద్దెకు తీసుకుని , 81 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఆర్‌డబ్ల్యూస్ ఏఈ లు ఐదు గ్రామాలు తిరిగి, గ్రామంలో ఉన్న నీటి సమస్య పైపు లైన్ల లీకేజీ, జీఎస్‌ఎల్‌ఆర్ ట్యాంకుల ఓవర్ ఫ్లో, పైపులైన్ల డ్యామేజీ తదితర వాటిని పరిశీలించి తక్షణమే పరిస్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవినాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రమణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సీఈవో మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
లారీ ఢీకొని విద్యార్థి మృతి
వలిగొండ (నల్లగొండ) : బస్సు దిగి ఇంటికి నడిచి వెళ్తున్న ఓ విద్యార్థి ప్రాణాన్ని లారీ హరించి వేసింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గేదెళ్లగూడెం గ్రామం వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునికుంట్ల ప్రకాశ్(20) రామన్నపేటలోని కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం 2.40 గంటల సమయంలో ప్రకాశ్ కళాశాల నుంచి వచ్చి గ్రామం వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
ఆఫర్ అంటూ కుచ్చుటోపీ..
వలిగొండ (నల్లగొండ జిల్లా) : మీరు చాలా కాలంగా మా నెట్వర్క్ నెంబర్ వాడుతున్నారు, మీకు మా కంపెనీ ఆఫర్ ప్రకటించిందంటూ.. వచ్చిన ఫోన్ కాల్ నమ్మి ఓ వ్యక్తి చేతి చమురు వదిలించుకున్నాడు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్లకు చెందిన వరికుప్పల ఆగమయ్యకు పది రోజుల క్రితం 911133564001, 911133564044 నెంబర్ల నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎన్ని రోజులుగా మా నెట్వర్క్ వాడుతున్నారని అవతలివారు అడిగారు. దీంతో ఆగమయ్య.. పది సంవత్సరాలుగా వాడుతున్నానని తెలిపాడు. మీరు చాలా కాలంగా మా నెట్వర్క్ వాడుతున్నందున మా నెట్వర్క్ కంపెనీ మీకు మంచి ఆఫర్ ప్రకటించిందని తెలిపారు. మీకు సామ్సంగ్ సెల్‌ఫోన్, 4జీ మొమరీ కార్డు, రెండు గడియారాలు, 5 వేల విలువ చేసే షాపింగ్ వోచర్లు పది రోజులలో పంపిస్తామని చెప్పారు. అలా చెప్పి ఆగమయ్య పోస్టల్ అడ్రస్ తీసుకున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్ తీసుకునే సమయంలో ఫోస్టాఫీస్లో కేవలం రూ.3 వేలు చెల్లించండని తెలిపారు. గిఫ్ట్‌ప్యాక్ పంపించాం, అందిందా అని తిరిగి సోమ, మంగళవారాలలో 911133564031 నెంబరు నుంచి ఫోన్ చేశారు. వీరి ఫోన్ రావడంతో ఆగమయ్య మంగళవారం గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లాడు. పోస్టాఫీస్‌లో ఆయన పేరున గిఫ్ట్ ప్యాక్ వచ్చి సిద్ధంగా ఉంది. దీంతో వారు చెప్పిందంతా నిజమని నమ్మిన ఆగమయ్య 3 వేలు చెల్లించి గిఫ్ట్ ప్యాక్‌ను అందుకున్నాడు. వెంటనే గ్రామస్తుల ముందు దానిని ఓపెన్ చేసి చూడగా వారు చెప్పింది ఒక్కటి కూడ లేదు. అందులో హనుమాన్ చిన్న విగ్రహం, యంత్రం, దేవుడి ఫోటో, సీడీ క్యాసెట్ మాత్రమే కనిపించాయి. దీంతో ఆగమయ్య పరిస్థితి ఆగంగా మారింది. నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నాడు. -
చెట్టుపైనుంచి పడి గీత కార్మికుని మృతి
వలిగొండ (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లేపాక గ్రామానికి చెందిన గీత కార్మికుడు కల్లు కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందాడు. రెడ్లరేపాక గ్రామానికి చెందిన జవ్వగారి మైసయ్య(53) ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీస్తుండగా పట్టుతప్పి పడిపోయి మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి
వలిగొండ (కర్నూలు): ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లా వలిగొండలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చైత్ర (9) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. అయితే నేడు పిండి మిల్లుకు వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు మిల్లులో పడి మృతి చెందింది. ఈ ఘటన సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వలిగొండలో 3జీ సేవలు
వలిగొండః మండలకేంద్రంలో ఎయిర్టెల్ 3 జీ సేవలను ఆ సంస్థ డీలర్ గజ్జెల శ్రీధర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేవలం 2జీ మాత్రమే ఉండేదని, వినియోగదారుల సౌకర్యార్ధం 3జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 3జీ నెట్ స్పీడ్‌గా ఉంటుందని విద్యార్థులు, వ్యాపారులు సేవలను ఉపయోగించు కోవాలన్నారు.ఈ సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లు అందించారు. -
బిడ్డా.. ఎక్కడున్నావ్ రా!
తప్పిపోయిన బిడ్డ కోసం తల్లి ఆరాటం వలిగొండ : మాటలురాని బిడ్డ మూడురోజులనుంచి కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడోనని ఆ తల్లి ఆరాటం అంతాఇంతాకాదు. మండలకేంద్రంలోని జంగాలకాలనీలో ఉండే మోతే సారంగం, విజయ దంపతులు భవన నిర్మాణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు కుమారులుండగా పెద్ద కుమారుడు రవీందర్ (15)కు పుట్టుకతో మాటలు రావు. వారికున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అతడిని పాఠశాలలో చేర్పించకుండా ఇంటి వద్దనే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇటీవలే వలిగొండలో ఏర్పాటు చేసిన వికలాంగుల కేంద్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. అది ఇష్టంలేని రవీందర్ మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినా ఇంత వరకు కనిపించలేదు. మాటలు రాని బిడ్డ ఎక్కడకు వెళ్లాడో..ఏ ఊరో చెప్పలేని, రాయలేని కొడుకు ఏం తిన్నాడోనని తల్లి వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. ఎవరికైనా ఆచూకీ లభిస్తే 8499836185, 9848808713 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వలిగొండ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగస్వామి(24) బుధవారం పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లింగస్వామికి ఇంకా వివాహం కాకపోవడం, చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. లింగస్వామి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ
నల్లగొండ (వలిగొండ) : తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆవిష్కరించున్నారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని సుంకిశాలలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చెరుకు శివయ్యగౌడ్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరు కానున్నారు. -
నిద్రమత్తులో జారిపడి వ్యక్తి మృతి
వలిగొండ(నల్లగొండ): నిద్రమత్తులో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కె. శ్రీను(38) గురువారం రాత్రి డాబాపై నిద్రించాడు. శుక్రవారం ఉదయం నిద్రమత్తులో పై నుంచి కిందపడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పట్టపగలే చోరీ
వలిగొండ : పట్టపగలు ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు బైక్ ను కూడా ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన దంతూరి సత్తెయ్య అనే వ్యక్తి తన కూమార్తెతో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా ఇంట్లో సత్తెయ్య భార్య ఒక్కరే ఉన్నారు. అయితే ఆమె కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, ఒక హీరోహోండా బైక్ మాయమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.