
సాక్షి, వలిగొండ (భువనగిరి) : పట్టపగలే ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన వలిగొండ మండలం సంగెం గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్య (62)ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వృతిలో భాగంగా శుక్రవారం కైతపురంలో ఓగ్గు కథ చెప్పి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కారులో వెంబడించి సంగెం గ్రామ సమీపములో ఢీకొట్టారు.
దీంతో శంకరయ్య రోడ్డుపక్కన పడిపోవడంతో వెంటనే కొంత మంది దుండగులు కారు దిగి శంకరయ్య మెడ చెవులు కోసి శరీరంపై ఉన్న నగలను తీసుకెళ్లారు. మెడ భాగములో తీవ్ర రక్తస్రావం కావడంతో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అటు వైపు వెళుతున్న వాహనదారులు సమాచారం ఇవ్వడముతో ఎస్సై శివనాగ ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ ఇచ్చిన మాచారం మేరకు డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఘటన స్థలంలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసి ఆధారాలు సేకరించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంగారు ఆభరణాల కోసం హత్య చేశారా..? మరో కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment