చేతిలో సిగరెట్‌.. కాళ్ల మధ్య స్టీరింగ్‌ | Tractor Accidentally Falls Into Musi River Vemulakonda | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే ముంచింది!

Published Mon, Jun 25 2018 1:55 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Tractor Accidentally Falls Into Musi River Vemulakonda - Sakshi

ట్రాక్టర్‌లో మహిళల మృతదేహాలు.. రోదిస్తున్న బంధువులు

సాక్షి, యాదాద్రి/వలిగొండ : డ్రైవర్‌ 60 ఏళ్ల వృద్ధుడు.. లైసెన్స్‌ లేదు.. గతంలో డ్రైవింగ్‌ చేసిన అనుభవం అంతకంటే లేదు.. ఇటీవల నేర్చుకొని ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టాడు.. 30 మందిని ఎక్కించుకున్నాడు.. వీటన్నింటికితోడు అంతులేని నిర్లక్ష్యం.. సిగరెట్‌ వెలిగించుకునేందుకు స్టీరింగ్‌ను కాళ్లకు అప్పగించాడు.. అంతలోనే చిన్న కుదుపు.. కంట్రోల్‌ చేసేందుకు బ్రేకు తొక్కాడు.. అయినా అదుపు తప్పింది.. పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి బోల్తా కొట్టింది.. చూస్తుండగానే ట్రాలీ తిరగబడి 15 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! మృతుల్లో 14 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదమిదీ!! బయల్దేరిన ఐదు నిమిషాలకే అమాయకులైన నిరుపేద కూలీలు జలసమాధి అయ్యారు. మరో పది నిమిషాల్లో చేనుకు చేరి పనులు చేసుకునే వారి బతుకులు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో తెల్లారిపోయాయి.
 
ఎలా జరిగిందంటే..? 
వేములకొండలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని వెంకటనారాయణ మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా సాగుకు సిద్ధమయ్యాడు. ఇటీవల వర్షం కురవడంతో ఆదివారం పత్తి విత్తనాలు వేసేందుకు తన ట్రాక్టర్‌ఈ ట్రాక్టర్‌(ఏపీ16 ఏబీ 8775)లోనే లోనే 30 మంది కూలీలను తీసుకుని చేనుకు బయల్దేరాడు. కూలీలకు పంచేందుకు స్వీటు డబ్బా కూడా తీసుకుని వెళ్లాడు. ట్రాక్టర్‌ ఇంజిన్‌పై వెంకటనారాయణతోపాటు మరో ఐదుగురు కూర్చున్నారు. డ్రైవర్‌ వెనుక చెక్కపై ముగ్గురు, రెండువైపులా టైర్లపైన ఒక్కొక్కరు చొప్పున కూర్చున్నారు.

ఇది పాత మోడల్‌ ట్రాక్టర్‌. టైర్లు పూర్తిగా అరిగిపోయాయి. కొంతకాలంగా వాడటం లేదు. కూలీలను తీసుకెళ్లేందుకు ఆదివారమే బయటకు తీశాడు. రెండు బ్రేక్‌లు ఒకేసారి కొడితేనే ట్రాక్టర్‌ నిలకడగా ఆగుతుంది. ఎడమ, కుడి బ్రేక్‌లలో ఏ ఒక్కదాన్ని నొక్కినా ట్రాక్టర్‌ అటువైపే లాగుతుంది. కూలీలతో బయల్దేరిన ఐదు నిమిషాలకు సిగరెట్‌ ముట్టించేందుకు వెంకట నారాయణ రెండు చేతులు విడిచిపెట్టి స్టీరింగ్‌ను రెండు కాళ్ల మధ్య పెట్టి తిప్పాడు. ఇదే సమయంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి కుడివైపు ఉన్న మూసీ కాల్వ వైపు మళ్లింది. దీంతో డ్రైవర్‌ కుడి వైపు బ్రేక్‌ తొక్కడంతో ట్రాక్టర్‌ ట్రాలీ కూడా అటువైపే ఒరిగింది. అది నల్లరేగడి భూమి కావడం, శుక్రవారం కురిసిన వర్షానికి నానడంతో స్కిడ్‌ అయి ట్రాలీ కాల్వలో పడిపోయింది.

గుర్రపు డెక్క.. పట్టా.. 
ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి గుర్రపు డెక్క కూడా కారణంగా కనిపిస్తోంది. మూసీ కాల్వ వెంట గుర్రపు డెక్క ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ట్రాలీ తిరగడి పడిపోవడం, అందులోని కూలీలు గుర్రపు డెక్క మధ్య చిక్కుకుపోవడంతో బయటపడే మార్గం మూసుకుపోయింది. అలాగే ట్రాలీలో కూర్చునేందుకు యూరియా బస్తాల పట్టా పరిచారు. కాల్వలో ట్రాక్టర్‌ పడిపోగానే ఇది కూడా కూలీలపై పడిపోయి ఊపిరి ఆడకుండా చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వెంకటరమణ అక్కడ్నుంచి పారిపోయాడు.

 మృతులు వీరే.. 
జడిగె మారమ్మ( 55), ఎనుగుల మాధవి (26), బందారపు స్వరూప (35), పంజాల భాగ్యమ్మ (27), బీసు కవిత (27), కాడిగల్ల లక్ష్మమ్మ (35), మనీషా (18), కాడిగల్ల నర్మద( 25), ఇంజమూరి శంకరమ్మ (30), ఇంజమూరి నర్సమ్మ (50), అంబాల రాములమ్మ(50), అరూరు మణెమ్మ (30), గన్నెబోయిన అండాలు( 35), బోయ శంకుతల(23), మల్లిఖార్జున్‌ (4). వీరిలో కాడిగల్ల లక్ష్మమ్మ, మనీషాలు తల్లికూతుళ్లు. మృతదేహాలకు వేములకొండలోని పీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు.

బయటపడిన 15 మంది.. 
ప్రమాదంలో 15 మంది గాయాలతో బయటపడ్డారు. వారిలో కాడిగల్ల అఖిల, కాడిగల్ల హేమలత, గన్నెబోయిన మంజుల, రత్నకుమారి, జోగు శాంతమ్మ, మట్టిపల్లి లక్ష్మమ్మ, ఇంజమూరి లక్ష్మమ్మ , రాపోలు జయమ్మ, బొంగు లక్ష్మమ్మ, కాడిగల్ల తేజ, అంబుల సోమమ్మ, కోట అనిత, బొంత మంజుల, కాడిగల్ల ఇందిర ఉన్నారు. వీరిని రామన్నపేట, భువనగిరి ఏరియా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
 
ఏడాది క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి..
వేములకొండకు చెందిన సుంచు నర్మద (25) భర్త నరేశ్‌ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెకు మహీదర్‌(6), అవంతిక(4) సంతానం. గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా శిక్షణ పొందుతోంది. నర్మద సాధారణంగా కూలీకి వెళ్లదు. ఆదివారం రోజు ఇంటి దగ్గర ఉండలేక తన చెల్లి మనీషతో కలసి పత్తి గింజలు పెట్టేందుకోసం వెళ్లింది. ప్రమాదంలో నర్మద మృతి చెందగా, శిరీష ట్రాక్టర్‌ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పటికే తండ్రి చనిపోగా, ఇప్పుడు తల్లి మరణించడంతో పిల్లలు మహీదర్‌(6), అవంతిక అనాథలయ్యారు. అమ్మమ్మ, మేనత్త, పిన్నిల వద్దకు వెళ్లి అమ్మ కావాలంటూ చిన్నారులు ఏడ్వడంతో చూసినవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.  

అయ్యో పాపం..! 
చౌటుప్పల్‌: పొట్ట చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన ఓ కుటుంబం ట్రాక్టర్‌ ప్రమాదంతో ఛిన్నాభిన్నమైంది. కర్నూలు జిల్లా ఆధోని గ్రామానికి చెందిన బోయ పరశురాం(35).. భార్య శకుంతల(30), నాలుగేళ్ల కుమారుడు మల్లిఖార్జున్‌తో కలిసి 15 రోజుల క్రితం జీవనోపాధి కోసం భువనగిరి జిల్లా వేములకొండకు వచ్చారు. గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇంటి వద్ద కుమారుడి ఆలనాపాలనా చూసే వాళ్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంట తీసుకెళ్తున్నారు. ఆదివారం కూడా ముగ్గురు కలిసి ట్రాక్టర్‌లో ఎక్కారు. బాలుడు తల్లి ఒడిలో కూర్చోగా పరశురాం ట్రాలీ వెనుక భాగంలో బాడీపై కూర్చున్నాడు. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతిచెందగా పరశురాం ప్రాణాలతో బయటపడ్డాడు.  

మేమే బయటకు తీశాం
ట్రాక్టర్‌ బోల్తా పడిందని తెలియగానే పరుగున వచ్చాం. 15 మంది చనిపోయారు. వారందరినీ బయటకు తీశాం. మరో ఏడుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. వారిని బయటకు తీసి ఆస్పత్రికి పంపించాం. – ఏర్పుల యాదయ్య, వేములకొండ

పట్టా చుట్టేసింది
ట్రాక్టర్‌ బోల్తా పడిన సమయంలో ట్రాలీలో కూర్చున్న మహిళలంతా నీటిలో పడిపోయారు. వారిపై ట్రాలీ పడింది. మహిళలు కూర్చునేందుకు ట్రాలీలో పట్టా ఏర్పాటు చేశారు. అది మహిళలను చుట్టేసింది. లోపల ఉన్న వారు బయటకు రాలేకపోయారు. పైన బçస్తా పట్టా, ఆపై ట్రాలీ ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. – గుడెళ్ల శ్రీహరి, ప్రత్యక్ష సాక్షి   

ఊపిరాడకే చనిపోయారు: పోస్టుమార్టం నివేదిక
ట్రాక్టర్‌ ప్రమాద మృతుల పోస్టుమార్టం నివేదికను వైద్యులు విడుదల చేశారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే కూలీలంతా చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోట్యానాయక్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఛాతీపై బరువు పడడంతో 9 మంది, నీళ్లు మింగి ఆరుగురు చనిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వెంకటనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

ముందే హెచ్చరించిన సాక్షి 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాల్వ కట్టలు బలహీనంగా, ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ‘సాక్షి’ముందే హెచ్చరించింది. ఏప్రిల్‌ 6న పెద్ద అడిశర్లపల్లి మండలం పడమటితండాలో కాల్వలో ట్రాక్టర్‌ బోల్తా పడి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని మూసీ, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ కాల్వ కట్టల పరిస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక ఫొటో ఫీచర్‌ ప్రచురించింది. ఎక్కడెక్కడ ప్రమాదం పొంచి ఉందో వివరించింది. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  

కేసీఆర్‌ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్‌: ట్రాక్టర్‌ ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఉత్తమ్, జానా సంతాపం
వేములకొండలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్‌ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ వద్ద మూసీ కాలువలో బోల్తా పడిన ట్రాక్టర్‌

2
2/2

భార్య, కుమారుడి మృతదేహాల వద్ద రోదిస్తున్న పరశురాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement