కనకయ్య, రాములు మృతదేహాలుచికిత్స పొందుతున్న తల్లి బిడ్డ
అర్వపల్లి(తుంగతుర్తి) : రోడ్డు ప్రమాదంలో మామా, అల్లుడు మృతిచెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం మండలంలోని కుంచమర్తి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిన్న సూరారం గ్రామానికి చెందిన ఓర్సు రాములు(45) తన కుమార్తెను తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వేముల కనకయ్య (25)కిచ్చి మూడేళ్ల కిందట వివాహం చేశాడు.
అయితే వీరికి ఒక కూతురు జన్మించింది. చిన్నారి లక్కికి ఏడాదిన్నర వయస్సు. కాగా రాములు రెండురోజుల కిందట అన్నారం వచ్చి మంగళవారం తన అల్లుడు కనకయ్య, కూతురు శైలజ, మనవరాలు లక్కిని తీసుకుని చిన్నసూరారానికి.. అల్లుడి బైక్‌పై బయలుదేరారు. కనకయ్య బైక్ నడుపుతుండగా భార్య, మామ, కుమార్తె వెనుక కూర్చున్నారు.
కుంచమర్తి గ్రామ శివారులోకి వెళ్లాక రోడ్డు డ్యామ్‌పై బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వారిని ప్రైవేట్ వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా కనకయ్య, రాములు మార్గమధ్యంలో మృతిచెందారు. శైలజ, లక్కి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు రోజులు విశ్రాంతి కోసమని తీసుకెళ్తుండగా..
కనకయ్య అన్నారంలో తన కులవృత్తి బండరాయి కొట్టే పనిచేస్తున్నాడు. అయితే రెండురోజులు విశ్రాంతి కోసమని అల్లుడు, కుమార్తెను ఆమె తండ్రి ఓర్సు రాములు తన ఇంటికి చిన్నసూరారం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే రాములు భార్య గతంలోనే మరణించింది. కాగా ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. బుధవారం పోస్టుమార్టం జరిపించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. కనకయ్య తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment