సత్యవేడు/నాగలాపురం, న్యూస్‌లైన్: రెండు సంతకాలతో పేదల బతుకుల్లో మార్పు తీసుకువస్తానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు రచ్చబండ సభకు వస్తూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడాన్ని తట్టుకోలేక నాగలాపురం మండలం ఎస్‌ఎస్‌పురం దళితవాడకు చెందిన బాలపల్లి పెద్దబ్బ భార్య సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందింది.
ఆమె కుటుంబాన్ని జగన్ మోహన్‌రెడ్డి సోమవారం ఓదార్చారు. పెద్దబ్బ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవడు, మనవరాళ్లను ఆయన పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తానుచేసే తొలి రెండు సంతకాలతో పేదబతుకుల్లో మార్పులు వస్తాయని భరోసా ఇచ్చారు. తొలి సంతకంతో అవ్వా, తాతలకు * 700 పింఛన్, రెండవ సంతకంతో అమ్మఒడి పథకం ద్వారా చదువుకునే చిన్నారులకు నెలకు *1000 అందుతుందని తెలిపారు.
ఈ పథకం ద్వారా పేదలు తమ బిడ్డలను ఖర్చు లేకుండా చదివించుకోవచ్చన్నారు. అనంతరం పెద్దబ్బ కుటుంబ సభ్యుల వివరాలను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. తాను ఎస్వీ యూనివర్సిటీలో ఫిజిక్స్ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేస్తున్నానని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నామని పెద్దబ్బ చిన్న కుమారుడు చంద్రబాబు తెలిపారు. పీహెచ్‌డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్ ద్వారా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని జననేతకు చంద్రబాబు తెలిపాడు.
ఆర్థిక సాయం అందకపోవడంతో చదువులు మాని పనులకు వెళ్తున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాతా.. పింఛన్ వస్తుందా అని పెద్దబ్బను జగన్‌మోహన్‌రెడ్డి అడిగారు. *200 వస్తుందని ఆయన తెలిపాడు. మరో నాలుగు నెలలు ఓపిక పడితే వృద్ధులకు మంచిరోజులు వస్తాయన్నారు. కూలిపనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నామని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి పెద్దబ్బ కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పెద్దబ్బ పెద్దకోడలు రేణుకతో మాట్లాడారు. మీ గ్రామంలో పాఠశాల ఉందా? పిల్లలను బడికి పంపుతున్నారా? వసతులు ఎలా ఉన్నారుు? మంచినీటి వసతి ఉందా? ఉపాధ్యాయులు పాఠాలను సక్రమంగా నేర్పుతున్నారా?, మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోందని ఆరాతీశారు. పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని, మరుగుదొడ్ల సౌకర్యం లేదని, మధ్యాహ్న భోజనం బాగుండడం లేదని ఆమె తెలిపింది. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని తెలియజేసింది.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దబ్బ మనవడు మాతయ్య(5), అదే గ్రామానికి చెందిన సుభాషిణి కుమార్తె పూజ(4 నెలలు)ను వైఎస్. జగన్ పరామర్శించారు. వీరిద్దరి వైద్య సేవల విషయమై చూడాలని పార్టీ రాజంపేట, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్‌కు సూచించారు. మిథున్, వరప్రసాద్‌లను ఆయన వారికి పరిచయం చేశారు. తిరుపతి ఎంపీ స్థానానికి వరప్రసాద్, సత్యవేడు అసెంబ్లీ స్థానానికి ఆదిమూలం పోటీ చేయనున్నారని తెలిపారు.
వీరికి సహకరించాలని వారి ఫోన్ నంబర్లను పెద్దబ్బ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. మీ బాబాయిలా పెద్ద చదువులు చదువుకోవాలని పెద్దబ్బ మనుమరాళ్లను దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, వైఎస్సార్ సీపీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిన్నదురై, ఎస్‌ఎస్‌పురం గ్రామ సర్పంచ్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
పేదల బతుకులో మార్పుతెస్తా
Published Tue, Jan 28 2014 4:30 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement