పీఠం కోసం అడ్డదారులు..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మునిసిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులను జిల్లా ప్రజలు ఛీకొట్టారు. అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధిరాలేదు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి అడ్డదారులు తొక్కుకున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ ప్రలోభాలకు తెరతీస్తున్నారు. పదవుల ఆశతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం.. తామేమి చేసినా చెల్లుతుందనే దుర్భుద్ధితో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు.
బలం లేకపోయినా జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కంటే ఎక్కువ మంది జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాల్లో 30 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీకి 20, కాంగ్రెస్‌కు 2, ఆర్‌పీఎస్ 1 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. 27 జెడ్పీటీసీ అభ్యర్థులు ఉంటే వారిదే జిల్లా పరిషత్.
అంతకంటే ఎక్కువ బలం ఉన్న వైఎస్సార్‌సీపీకి పీఠాన్ని దక్కనివ్వకుండా చేసేందుకు టీడీపీ నేతలు..వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులకు పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపిస్తున్నారు. మరి కొందరికి డబ్బుతో పాటు పదవిని కూడా ఎరవేస్తున్నారు. ఎలాగైనా జెడ్పీ పీఠం దక్కించుకున్నాక.. పార్టీ ఫిరాయింపుల చట్టం అమలైనా తమకేం నష్టం ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఎటువంటి ఫిరాయింపుల చట్టం వర్తించదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
నలుగురికి చైర్మన్ హామీ, ఇద్దరకి ఎమ్మెల్సీ..
జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని టీడీపీ నేతలు జిల్లాలో నలుగురుకి హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులకు, అలాగే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆలూరు, పత్తికొండ, నందికొట్కూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నలుగురు జెడ్పీటీసీ సభ్యులను ఒప్పించినట్లు తెలిసింది.
అయితే ఈ నలుగురికి నలుగురు టీడీపీ నేతలు హామీ ఇవ్వటం గమనార్హం. ఈ నలుగురు జెడ్పీటీసీల్లో ఒకరు రూ.కోటితో గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరొకరు అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేతతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీకి కైవసం చేసిన నాయకునికి స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతామని జిల్లాలోని ఇద్దరు నేతలకు ఆ పార్టీ ముఖ్యనేత హామీ ఇచ్చినట్లు సమాచారం.
జెడ్పీ కోసం పనిచేసిన వారికి అమాత్య పదవట..!
జెడ్పీ చైర్మన్ పీఠాన్ని టీడీపీకి కట్టబెట్టేలా ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలకు అమాత్య పదవిని కట్టబెడుతామని ఆశ చూపినట్లు పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడికి ఇప్పటికే మంత్రి పదవి ఖాయమైంది. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలకూ అమాత్య పదవిని ఆశ చూపినట్లు తెలిసింది. అందుకోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులకు ఎర వేస్తున్నట్లు సమాచారం.