వారం రోజుల్లో విద్యుత్ కోతలకు చెక్
తాడేపల్లిగూడెం : వారం రోజుల్లో విద్యుత్ కోతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను ప్రజలు చూడబోతున్నారని దేవాదాయ,ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం స్థానిక జిల్లా మిల్లర్ల అసోసియేషన్ హాలులో సోమవారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రి మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీలో ఒకడిగా భావించి సామాన్యుడినైనా నన్ను గెలిపించారని, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మీలో ఒకడిగా ఉంటానని చెప్పారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పటికే దృష్టిసారించానన్నారు. విమానాశ్రయ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందచేస్తామని, దీనికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటరీ నియోజవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని, వీటిని వినియోగించుకోవాలన్నారు.
టీ డీపి జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గూడెం పట్టణంలోకి ప్రవేశించడానికి జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లు లేవని, వాటి విషయంలో ఎంపీ శ్రద్ద వహించాలన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రాన్ని పూర్వ వైభవంలోకి తేవాలన్నారు. సభ అనంతరం మంత్రి మాణిక్యాలరావుకు, ఎంపీ గంగరాజును పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ రణాల మాలతీరాణి, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవ ర్మ తదితరులు పాల్గొన్నారు.