ఏపీ అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే దీక్ష
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వెలుపల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం దీక్ష చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల రంగు దుస్తులు ధరించి దీక్షకు దిగారు. రవాణాశాఖ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన కేశినేని ట్రావెల్స్ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పక్షపాత వైఖరి నిరసిస్తూ బహిరంగ లేఖ రాశారు.
తిరుపతి విమానాశ్రయంలో తాను, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కాళహస్తి ఇంఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అసత్యపు కేసు పెట్టి 21 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని లేఖలో రాశారు. నెల్లూరు జైలులో ఉండగానే మరో కేసులు పెట్టి రాజమండ్రి, పీలేరుకు తరలించారని గుర్తు చేశారు. మీ పార్టీ నేతలు తమ అనుచరులతో కలిసి ఐజీ స్థాయి అధికారిని దుర్భాషలాడి, దాడి చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం పేరుతో నాటకాలాడి కేసులు లేకుండా చేశారని ఆరోపించారు. మీ పార్టీకి చెందినవాళ్లయితే కేసులు ఉండవా అని సూటిగా ప్రశ్నించారు.
టీడీపీ ఎన్ని అరాచకాలు చేసిన కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. చట్టం, న్యాయం అందరికీ ఒకేలా ఉండవా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్యాయమైన పాలనే కాదు, తాలిబాన్ల నడుస్తోంది మండిపడ్డారు. ఏ తప్పు చేయని తమను వెంటాడి, వేధించి సెంట్రల్ జైలుకు పంపిన చంద్రబాబు.. ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిపోయిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, చర్యలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి:
సారీతో సరి
‘ఇది బాధాకరమైన సంఘటన’
క్షమాపణలు చెప్పిన కేశినేని, బోండా ఉమా
బస్సులు ఆపేస్తా.. పార్టీ ముఖ్యం: కేశినేని నాని
ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం