మొదటి ముద్దాయి బాబే
నామినేటెడ్ ఎమ్మెల్యేను మభ్య పెట్టడంలో బాబే సూత్రధారి అంటూ ఆందోళనలు
జాతీయ రహదారిపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాస్తారోకో
చిత్తూరులో గాయత్రీదేవి ఆధ్వర్యంలో మహిళల మౌన దీక్ష
‘బాబు టక్కరి. అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నిజస్వరూపం ఏంటో బయటపడింది. ఆయన డెరైక్షన్‌లోనే నామినేటెడ్ ఎమ్మెల్యే డీల్ నడిచింది. డబ్బును ఎరగా వేసి.. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించారు. బాబుపై కేసు నమోదుచేసి సీబీఐతో విచారణ జరిపించాలి’ అంటూ ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. చంద్రబాబు తీరును ఎండగట్టాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఓటుకు నోటు కేసులో బాబే మొదటి ముద్దాయి అంటూ సోమవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. దీనిపై కేసు నమోదుచేసి సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మేల్యేలను కొనడం ఏంటని మేధావులు విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటివి బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అధికారం కోసం ఎంతటికైనా దిగజారుతారనే దానికి ఈ సంఘటనే నిదర్శనమని పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు.
అవినీతి చంద్రబాబును అరెస్ట్ చేయండి
చంద్రగిరి ఎమ్మేల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలోని మల్లంగుంట చెక్‌పోస్ట్ సర్కిల్ బైపాస్ రోడ్డులో ‘అవినీతి చంద్రబాబు’ను అరెస్ట్ చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. రెండెకరాలు ఉన్న రైతుబిడ్డ చంద్రబాబుకు ఎమ్మెల్యేలను కొనేందుకు 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ విరుచుకుపడ్డారు.
బాబుపై కేసు నమోదు చేయాలి
పలమనేరులో పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు హేమంత్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత పీవీ.కుమార్ ఆధ్వర్యంలో బాబుపై కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. నారాయణవనంలో సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలం ఇది బాబు దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఆందోళన బాట
తంబళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. బి.కొత్తకోటలో వైఎస్సార్‌సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. శ్రీకాళహస్తిలో ప్లకార్డులు చేతభూని అవినీతి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ నినదించారు. పూతలపట్టు, జీడీ నెల్లూరులో బాబు దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు నేతలు ధ్వజమెత్తారు.
బాబును ప్రధాన ముద్దాయిగా చేర్చాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురాలోచనతో కోట్ల రూపాయలు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుక్కునే నీచపు సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చి కొనుక్కుని అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ డబ్బులు పంచమని స్వయంగా చంద్రబాబు చెప్పినట్లు వారి ఎమ్మెల్యేలు చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబుది ఎంత నీచపు సంస్కృతో అర్థమవుతుంది.
-నారాయణస్వామి, ఎమ్మెల్యే, గంగాధరనెల్లూరు
పావుగా వాడుకున్నారు
నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనే వ్యవహారంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఈ వ్యవహారంలో పావుగా వాడుకున్నారు. ఈ కేసులో బాబు పేరును చేర్చి విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా దిగజారుతారనేదానికి ఇదే నిదర్శనం.
-మిథున్‌రెడ్డి, ఎంపీ రాజంపేట
కుట్రల బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది జన్మంతా కుట్రలు, కుతంత్రాలుగానే సాగుతోంది. ఎన్‌టీఆర్ నుంచి పదవిని అక్రమంగా లాక్కున్న సంఘటన, ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో రాష్ట్ర జనాన్ని రుణమాఫీల పేరుతో మోసం చేసిన విధానాలు చూస్తేనే ఆయన నిజస్వరూపం బయటపడింది. ఇంత నీచమైన సంస్కృతికి పాల్పడిన రేవంత్‌రెడ్డినే కాకుండా అందుకు ప్రధాన కారకుడైన చంద్రబాబును కూడా తక్షణం అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
- పీ.నవీన్‌కుమార్ రెడ్డి, జేఎస్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి
సుమోటో కేసు నమోదు చేయాలి
తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రలోభానికి పాల్పడిన ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఎరచూపి అధిపత్యం సాగించాలనుకోవడం సిగ్గుచేటు. డబ్బులతో లాలూచీ పడే పార్టీలను బలోపేతం చేసుకోవడం అప్రజాస్వామ్యకమే. ఇలాంటి వారిపై ఎన్నికల కమిషన్, గవర్నర్ కఠిన చర్యలు తీసుకోవాలి.
-ఎ.రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి
టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనం
చట్టబద్ధంగా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సిన పరిస్థితిలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బుతో ఆధిపత్యం చాటేందుకు చేసిన ప్రయత్నిం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం. తెలంగాణలో టీడీపీని రక్షించుకునేందుకు బాబు చేస్తున్న కుట్ర రేవంత్‌రెడ్డి అరెస్ట్‌తో బట్టబయలైంది. ఇలాంటి రాజకీయ నేతలపై పటిష్ట చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. -కె.కుమార్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
రేవంత్‌ది నీతిమాలిన చర్య
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు ప్రయత్నించడం నీతిమాలిన చర్య. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని కఠింగా శిక్షించాలి. పదే పదే బాస్ బాబు పంపించారని చెప్పడం చూస్తే ముఖ్యమంత్రి నియంతృత్వ పరిపాలనకు, అనైతిక విధానాలకు దర్పణం పడుతోంది. ఈ సంఘటనతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది. అప్రజాస్వామ్యబద్ధంగా, ఆచరణకు వీలుకాని హామీలను ఇచ్చి అధికారంలోని వచ్చిన బాబుకు ప్రజలే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సంఘటన రాష్ట్రంలో గడ్డుకాలం ఏర్పడుతుందనడానికి నిజమైన సంకేతం. ఈ సంఘటన వెనుకవున్న వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి
-డాక్టర్ దేశాయ్ తిప్పా రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే