తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరండి..
హైదరాబాద్ : సీఎం ఫోన్ ట్యాప్ చేస్తారా అని అగ్గి మీద గుగ్గిలమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆ గొంతు నాది కాదని ఎందుకు స్పష్టం చేయడం లేదని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఓటు నోటుకు వ్యవహారంలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పు చేయక పోతే లీగల్ గా పోరాటం చేయాలి తప్ప చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తూ రాష్ట్ర పరువును గంగలో కలుపుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర గవర్నర్ను కూడా అవమానిస్తూ రాష్ట్రాభిమానాన్ని తాకట్టు పెడితే, విధ్వంస చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీరు చేసిన తప్పులను ఆంధ్ర ప్రజలు మోయాలా. ఈ నష్టాన్ని ఆంధ్ర ప్రజలు భరించాలా అని ఆయన ధ్వజమెత్తారు. తప్పు చేయక పోతే సీబీఐ విచారణ కోరాలని బొత్స డిమాండ్ చేశారు. సీఎం ఫోన్ ట్యాప్ చేయడం నేరమైతే దానికి చట్టాలున్నాయని, దానికి వ్యతిరేకంగా చట్టప్రకారం పోరాడాలని బొత్స అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వీధిపోరాటాలు చేస్తోంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని బొత్స మండిపడ్డారు. ఒంటెద్దు పోకడలకు పోతూ ఇలాంటి కార్యక్రమాలకు దిగడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.