నటనలో ఎన్టీ రామారావునే మించిపోయారు
నటనలో మహానటుడు ఎన్టీ రామారావునే చంద్రబాబు మించిపోయారని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రజలు ఎలా తలెత్తుకుని తిరగాలని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఆయన లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఓటుకు నోటు అంశంపై విలేకరులతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాప్ అయిందని మంగళగిరి సభ సాక్షిగా ఆయనే స్వయంగా చెప్పారని గుర్తుచేస్తూ.. ఆ గొంతు మీది కాదని ఎక్కడా చెప్పడం లేదు కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని మీరెక్కడా ఖండించడంలేదు కదా.. దీన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. అవినీతి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రయినా, సామాన్యుడైనా ఒకటేనని.. ముఖ్యమంత్రులకు ప్రత్యేక రక్షణ అంటూ ఏమీ ఉండబోదని, అవసరమైతే ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తారని ఆయన చెప్పారు.
అవినీతి చేయడానికి రాజ్యాంగం ఏ ముఖ్యమంత్రికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఒక మంత్రిని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని అరెస్టు చేయించారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. రెండు పార్టీల మధ్య వైరాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిచ్చుపెట్టే హక్కు నీకెవరిచ్చారని నిలదీశారు. అసలు ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారని, నీతి, నియమం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడమేంటని ఆయన అన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఏ ఒక్క హామీనైనా సంతృప్తికరంగా చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రెడ్హ్యాండెడ్గా పట్టుబడినా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏవైనా రెండు దేశాలు కాదని, ఫెడరల్ వ్యవస్థలో మనమంతా చట్టానికి లోబడి ఉండాలని హితవు పలికారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి జిల్లాలో ఆందోళనలు చేస్తుంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అక్కడకు వచ్చి ప్రజలు నిన్ను ఎలా ఛీకొడుతున్నారో వెళ్లి చూసుకోవాలని చెప్పారు. నీ వ్యక్తిత్వం ఏంటో ప్రజలు చెప్పాలి తప్ప, నీ అంతట నువ్వు చెప్పుకొంటే కుదరదని బొత్స సత్యనారాయణ తెలిపారు.