చెవిరెడ్డి భాస్కర రెడ్డి-పరకాల ప్రభాకర్
తిరుపతి: ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కిరాయి మనిషని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. భార్య పేరు చెప్పుకొని పదవి పొందారన్నారు. గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు పరకాల కట్టుబడి ఉన్నారా? అని అడిగారు. డబ్బు కోసం పాలకొల్లులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో పరకాల జైలుకు వెళ్లారన్నారు. వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోలేక పరకాల శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తన తండ్రి వృద్ధాప్య పింఛన్పై బహిరంగ చర్చకు పరకాల సిద్ధమేనా? అని చెవిరెడ్డి సవాల్ విసిరారు. తన తండ్రి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. తన తండ్రి ఎక్కడైనా ఒక రూపాయి పెన్షన్ తీసుకున్నట్లు చెప్పగలరా? అని అడిగారు. తన తండ్రికి పెన్షన్ మంజూరులో ఆయన ప్రమేయంలేదని సంబంధిత అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా తన తండ్రి పేరుతో సృష్టించిన దొంగ కార్డని ఆయన అన్నారు. ఇవన్నీ చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి గెలిచినందువల్ల ఈర్ష్య, అసూయలతో చేస్తున్న కుట్రలు, కుతంత్రాలే అన్నారు. తాను పోరాటాల ద్వారా రాజకీయంగా ఎదిగానని చెప్పారు. పరకాల ప్రభాకర్లాగా పైరవీలతో రాజకీయాలు చేసేవాడిని కాదని చెవిరెడ్డి చెప్పారు.
**