
చిదంబరం చిత్తుగా ఓడటం ఖాయం
రాష్ట్రం గురించి తెలియనివారు
విభజన సూత్రధారులు
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ విలీనం తప్పదు
90రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి: చంద్రబాబు
అధికార పార్టీపై విమర్శలు చేసినా పట్టించుకోని మంత్రి గల్లా
చిత్తూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు ఆజ్యం పోసిన కేంద్రమంత్రి చిదంబరం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఏజెంట్లకు డబ్బులు ముట్టజెప్పి చిదంబరం దొడ్డిదారిన గెలిచారని ఆరోపిం చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో ఆదివారం మాజీ ఎంపీ ఎన్‌పీ చెంగల్రాయ నాయు డు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం గా నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ర్టం గురించి తెలియని చిదంబరం, మరో కేంద్రమంత్రి వీరప్పమొయిలీ నేడు రాష్ట్ర విభజన విషయంలో సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌లో విలీనమవడం ఖాయమన్నారు. పదేళ్లుగా రాష్ర్టం భ్రష్టుపట్టి పోయిందన్నారు. 90రోజులు ఓపిక పట్టండి పార్టీకి మంచి రోజులు వస్తాయని కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు బహిరంగంగా విమర్శిస్తున్నా కార్యక్రమానికి హాజరైన మంత్రి గల్లా అరుణకుమారి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి నిమ్మకు నీరెత్తినట్టు అదే వేదికపై కూర్చొని ఉండడం గమనార్హం. ఈ సభలో ఎంపీ శివప్రసాద్, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, శాసనసభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు బంగారుపాళెం మండలంలోని శేషాపురంలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.
నేడు కలకత్తాకు చంద్రబాబు
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా, తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు భేటీ కానున్నారు. తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పడం, అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయం లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నారు. నేతలంతా మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.