ప్రతీ బూత్‌కూ కేంద్ర బలగాలు
నంద్యాల ఉప ఎన్నిక నిర్వహణపై భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక జరిగే నంద్యాల శాసనసభ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌ల బందోబస్తుకు కేంద్ర బలగాలను దించుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ స్టేషన్లను వెబ్ కాస్టింగ్‌కు అనుసంధానం చేస్తామని, ఓటింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే మంత్రులైనా సహించమన్నారు. హైదరాబాద్‌లో గురువారం విలేకరులకు నంద్యాల ఉప ఎన్నిక ఏర్పాట్లను భన్వర్‌లాల్ వివరించారు. ఈ అసెంబ్లీ స్థానంలో మొత్తం 2,19,108 ఓట్లు ఉన్నాయని, ఈ నెల 5వ తేదీ వరకూ నమోదు చేసుకున్న ప్రతీ వ్యక్తిని ఓటర్ జాబితా పరిధిలోకి తెచ్చామన్నారు. ఆరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిపారు.
అధికార దుర్వినియోగం సహించం
అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని భన్వర్‌లాల్ హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పదాదికారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ సమయంలో అధికార యంత్రాంగాన్ని వాడుకున్నా, వాహనాలు ఉపయోగించినా, ప్రభుత్వ అతిథి గృహాల్లో బస చేసినా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టే భావిస్తామని, వారిపై కేసులు పెడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని భన్వర్‌లాల్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీన్ని జిల్లా కలెక్టర్‌కు పంపామని, ఆయన రిమార్క్స్ వచ్చాక, తానూ వీడియోను పరిశీలించి, వాస్తవ పరిస్థితిని ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు.