
సీఎం సభలంటే హడల్
ప్రజలను తరలించాలని టీడీపీ నేతల హుకుం
తడిసి మోపెడవుతున్న ఖర్చులు
నగదు విడుదల చేయని ప్రభుత్వం
అధికార పార్టీ తీరుతో నలిగిపోతున్న అధికారులు
సీఎం సభలంటే ప్రభుత్వ అధికారులు హడలిపోతున్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో జరిగే సభలకు ప్రజలను తరలించాలని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేస్తుండడం..ఇందుకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం విడుదల చేయకపోతుండడంతో అధికారులు నలిగిపోతున్నారు. సొంత ఖర్చులతో జనాలను తరలించలేక సతమతమవుతున్నారు.
నెల్లూరు(సెంట్రల్): ప్రభుత్వ తీరుతో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు నలిగిపోతున్నారు. ఇతర జిల్లాల్లో జరిగే బీసీ కార్పొరేషన్ కార్యక్రమాలకు జిల్లా నుంచి జనాలను తరలించాలని అధికార పార్టీ నేతలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నగదు విడుదల చేయడం లేదు. సొంత ఖర్చులతో తరలించాల్సి రావడంతో అధికారులు హడలిపోతున్నారు.
రూ.1.50 లక్షలకు పైసా ఇవ్వలేదు
ఈ నెల 11న విజయవాడలో సీఎం చంద్రబాబు బీసీ రుణమేళా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి సుమారు 120 నుంచి 150 మందికి తగ్గకుండా జనాలను తీసుకురావాలని సంబంధిత అధికారులను పురమాయించారు. అప్పట్లో అధికారులు సొంత నగదు పెట్టుకుని మూడు బస్సులు, ఇతర వాహనాల్లో తీసుకుని పోయారు. ఇందుకు గానూ రూ.1.50లక్ష ఖర్చు అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఇంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని సమాచారం.
150 మందికి తగ్గకూడదు
తాజాగా గుంటూరు సమీపంలో గురువారం జరగనున్న బీసీ రుణమేళాకు సంబంధించి జిల్లా నుంచి 150 మందికి తగ్గకుండా జనాభాను తీసుకురావాలని బీసీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు మొత్తం మూడు బస్సులు, ఇతర వాహనాల్లో జనాలను తరలించారు. ఒక్కో మనిషికి రానుపోను చార్జీలు, భోజనం, ఇతర ఖర్చులు కలిపి కనీసం రూ.1 వెయ్యి అవుతుంది. ఈ లెక్కన 150 మందికి సుమారుగా రూ.1.50 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రెండు సభలకు గానూ అధికారులకు సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు అయింది. అయితే ప్రభుత్వం రెండింటికి కలిపి రూ.60 వేలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిసారి జిల్లా నుంచి జనాభాను తీసుకురావాలని చెబుతుండడంతో సొంత నగదు పెట్టలేక అధికారులు సతమతవుతున్నారు. అంతేగాకుండా బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ అధికారులను మూడు రోజుల ముందు నుంచే విజయవాడలో ఉండమని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో పని పెండింగ్‌లో పడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
నిట్టూర్చుతున్న లబ్ధిదారులు
ఇతర జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేందుకు బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో అయితే వస్తాం.. మీరు ఇచ్చే రుణాల కోసం ప్రతిసారి ఇతర జిల్లాలకు రాలేమని పలువురు బీసీ కార్పొరేషన్ రుణ లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. విజయవాడ, గుంటూరులో సమావేశాలు ఏర్పాటు చేసే సమయంలో చుట్టుపక్కల వారిని తీసుకురావాలే తప్ప జిల్లా నుంచి జనాభాను తరలించుకుపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సభలకు జనాభా రాలేదని తమను తరలించాలని చూడడం ఎంతవరక సబబని వాపోతున్నారు.