మృతి చెందిన పసివాడు , కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి రాము
నవమాసాలు మోసి కని పెంచిన చిన్నారులు ఏడాదైనా నిండకుండానే కళ్లెదుటే మృత్యువాత పడడంతో ఆ ఇద్దరి తల్లుల గర్భశోకం తీర్చడం ఎవరి తరం కావడం లేదు. భగవంతుడు ఇంతటి దుఃఖాన్ని ఎందుకిచ్చాడంటూ వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటనీరు పెట్టించింది. భార్య, ఇద్దరు పిల్లలతో బైక్‌పై కాకినాడ వెళుతుండగా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల సూర్యకుమార్, సకాలంలో వైద్యం అందక రాజవొమ్మంగి మండలంలో రెండు నెలల పసికందు మృత్యువాత పడ్డారు.
ప్రత్తిపాడు రూరల్ (ప్రత్తిపాడు): రోడ్డు ప్రమాదంలో తొమ్మిది నెలలు బాలుడు మృతి చెందాడు.ధర్మవరం గ్రామానికి చెందిన రాకేటి వెంకటేశ్వరరావు భార్య రమాదేవి ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం బైక్ పై కాకినాడ బయలు దేరాడు. ధర్మవరం సమీపంలోని పెట్రోలు బంకులో పెట్రోలు నింపుకొని రహదారి దాటుతుండగా కత్తిపూడి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాకేటి సూర్యకుమార్ (9 నెలలు) బాలుడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తలకు, మరో నాలుగేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. వారిని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తరలించారు. చిన్నారి మరణవార్త తల్లికి చెప్పలేక బంధువులు తల్లడిల్లిపోయారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు ఎస్సై ఎం.అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు దర్యప్తు చేస్తున్నారు.
సకాలంలో వైద్యం అందక...
రాజవొమ్మంగి (రంపచోడవరం): రెండు నెలల మగ శిశువుకు సకాలంలో వైద్య సహాయం అందక మరణించింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్డంగి గ్రామానికి చెందిన పూసం రాము పుట్టిలైన దూసరపాము కాన్పుకి రాగా, జూన్ 26న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రం ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడని తల్లి తెలిపింది. దీంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకొని వెళ్లగా అక్కడ వైద్యులు లేరని తెలిపారు. సిబ్బంది పరీక్షించి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లమని సూచించారన్నారు. అక్కడ నుంచి ఏలేశ్వరం తీసుకువెళ్లగా, రూ.రెండు వేలు కట్టించుకొని జాయిన్ చేసుకున్నారని, కొద్ది సేపటికే బాబు మరణించాడని రాము, ఆమె భర్త వెంకట దుర్గాప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలో వైద్యులేకే తన బిడ్డ చనిపోయాడని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment