విద్యానగర్‌లో రోడ్లపై చిత్తు కాగితాలు ఏరుతున్న బడి ఈడు పిల్లలు
సాక్షి, కోట (నెల్లూరు): సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చింది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. బడి ఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే కనిపించాలని, ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్చేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనత కారణంగా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో కావలి తర్వాత గూడూరు నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువ మంది బడి ఈడు పిల్లలు పనులకు వెళ్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
విద్యాహక్కు చట్టానికి తూట్లు
విద్యాహక్కు చట్టం అమలులో లోటు పాట్లు కనిపిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరినీ బడిలో చేర్చుకోవాలన్నది లక్ష్యం. అయితే గూడూరు నియోజకవర్గంలో వెయ్యిమందిపైనే బడి బయట పిల్లలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి అధికారుల లెక్కల కంటే ఎక్కువగానే బడి బయట పిల్లలు వివిధ రకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా 8 నుంచి 14 ఏళ్లలోపున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన చిన్నారులు మోతుబరి రైతుల వద్ద పశువుల కాపరులుగా, ఇటుకల బట్టీలు, దుకాణాల్లో బాల కార్మికులుగా గడుపుతున్నారు. మండలంలోని కోట, విద్యానగర్, ప్రకాశంకాలనీ, గోవిందపల్లి, సిద్ధవరం, కొత్తపట్నం గ్రామాల్లో చిన్నారులు అధికంగా దుకాణా లు, హోటళ్లు, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, భవన నిర్మాణాల్లో జీవనం సాగిస్తున్నారు.
ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న చిన్నారులు
కాగా నియోజకవర్గంలో ఆక్వాసాగు పెరగడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు కూలీలుగా రొయ్యలగుంటల వద్ద చేరుతున్నారు. వారితో పాటు పిల్లలను బడి మా న్పించి పనులకు పంపుతున్నారు. కోట మండలంలోని పలు గిరిజన కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. వీరంతా బడిలో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నా అది వాస్తవం కాదు. కొంద రు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపి పనులకు వెళ్తున్న బాలలను పాఠశాలకు తీసుకువస్తున్నా వారి కొనసాగింపు కష్టంగా ఉంది. కార్మిక శాఖాధికారులు పట్టించుకోకపోవడం, విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు బడిమానేసి తిరిగి పనులకు వెళ్తున్నారు.
ముఖ్యంగా విద్యానగర్, ప్రకాశంకాలనీలో ఎక్కువ మంది బడిమానేసిన పిల్లలు రోడ్లపై తిరుగుతూ కాగి తాలు, పాతసామాన్లు ఏరుకుంటూ కనిపిస్తున్నారు. ఇక్కడ ఇసుప సామాన్ల దుకాణం నడుపుతున్న వ్యాపారి ముందుగానే డబ్బులు ఇస్తూ వారిని పనులకు ఉసిగొల్పుతున్నట్టు సమాచారం. డబ్బు చెల్లించలేని స్థితిలో పిల్లలు పాతసామాన్లు ఏరుకుని వచ్చి అమ్మి బాకీ కట్టాలని షరతులు పెట్టినట్టు తెలిసింది. బడికి వెళ్లకుండా రోడ్లపై తిరుగుతున్న కొందరు విద్యార్థులను ప్రశ్నించగా బడికి వెళ్లాలని ఉన్నా తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తుందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment