ఎమ్మిగనూరురూరల్, న్యూస్‌లైన్: పట్టణంలోని శ్రీ గుంటిరంగస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు బంధువులు బాలికకు వివాహం చేశారు. పెళ్లికుమారుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పోలీసుల సహకారంతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించి ఎవరి ఇళ్లకు వారిని పంపించివేశారు. సీడీపీఓ భవాని, ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సోగనూరుకు చెందిన దాసరి మాదన్న(33)కు అదే గ్రామానికి చెందిన మేనత్త కుమార్తె దాసరి తిమ్మక్కతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి బంధువైన నందవరం మండలం హలహర్వికి చెందిన దాసరి పాండురంగడు కుమార్తె మీనాక్షి(14)ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు తన భార్య ఆరోగ్యం బాగా లేదని సాకు చూపించాడు. అమాయకురాలైన మొదటి భార్యపై ఒత్తిడి తెచ్చి తన రెండో పెళ్లికి ఒప్పించాడు.
శుక్రవారం వెంకటాపురంలో గుంటిరంగస్వామి ఆలయంలో మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పట్టణ ఎస్‌ఐ చంద్రబాబునాయుడు సహయంతో పెళ్లి మండ పానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల వారినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. భార్య ఉండ గా వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరమని సూచించారు. మైనర్‌ను చేసుకోవడం మరీ పెద్ద నేరమన్నారు. భార్య ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నా వధువుకు 18 ఏళ్లు నిండి ఉండాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. వధూవరులతోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. వారితో పాటు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పవతి, బాలల సమగ్ర సంరక్షణ పథకం జిల్లా కోఆర్డినేటర్ రాజు, ఎంవీఎఫ్ మండల కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.