నెల్లూరు (క్రైమ్): బాల్యం మెడలో తాళి పడుతోంది. మూడుముళ్ల బంధం వారిని బందీ చేస్తోంది. సమాజం నాగరికత వైపు అడుగులేస్తున్న తరుణంలోనూ ఆర్థిక అసమానతలు.. నిరక్షరాస్యత.. బాలికలను జాగ్రత్తగా పెంచలేమనే బెంగ.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న అభద్రతా భావం వెరసి ముక్కుపచ్చలారకుండానే వారికి తల్లిదండ్రులు వివాహాలు చేస్తున్నారు. తమ పనైపోయిం దని చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో బాల్య వివాహాలు అధికమయ్యాయి. ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, అల్లూరు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. చట్టాలు చేసినా ఈ వివాహాలు ఆగడం లేదు. ఇలాంటి కేసుల్లో 10 శాతం మాత్రమే అధికారుల దృష్టికి వస్తుండగా.. 90 శాతం బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.
వెలుగులోకి కొన్నే.. గుర్తించనవి ఎన్నో
గూడూరు మండలం చెన్నూరు రామలింగయ్య కాలనీలో ఇటీవల 14 ఏళ్ల బాలి కకు షఫీ అనే వ్యక్తితో వివాహం చేసేం దుకు తల్లిదండ్రులు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు అడ్డుకున్నారు. నగరంలోని వెంగళరావు నగర్‌కు చెందిన ఓ చిన్నారికి అదే ప్రాంతానికి చెందిన యువకునితో వివాహం చేస్తుండగా ఐసీపీఎస్ అధి కారులు పోలీసుల సహకారంతో నిలువరించారు. అల్లూరు మండల పరిధిలోని పట్టపుపాలెంలో ఓ చిన్నారికి వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. గడచిన ఐదేళ్లలో 205 బాల్యవివాహాలను అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిలువరించగలిగాయి. అదే ఐదేళ్లలో 2,480 మంది బాలికలకు గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు అయ్యాయని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది.
కారణాలివీ
బాల్య వివాహాలకు అధిక సంతానం, పేదరికం ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. మేనరికం అందుబాటులో ఉండటం.. ఆ సంబంధాన్ని కలుపుకోకపోతే కూతుర్ని ఎలాంటి ఇంటికి పంపించాల్సి వస్తుందోనన్న భయం కూడా బాలికల వివా హాలకు పురిగొల్పుతోంది. వివాహ ఖర్చు పెరగడం, ప్రేమ పేరిట తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో బాలికల్ని బయటి ప్రాంతాలకు పంపించి చదివించేందుకు ఇష్టపడటం లేదు. తాతయ్య, అమ్మమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడం.. వాళ్లు బతి కుండగానే పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందన్న ఆలోచన, పరి మిత విద్యావకాశాలు, చదువులో వెనుకబడటం వంటి కారణాల వల్ల కూడా బాలికలకు వివాహాలు చేస్తున్నారు.
తలెత్తే అనర్థాలు..
బాల్య వివాహాల వల్ల ప్రధానంగా స్త్రీలు రక్తహీనతకు గురవుతారు. వారికి పుట్టే బిడ్డలు అనారోగ్యం బారిన పడటం, అవయవాల ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు సంభవిం చడం వంటి సమస్యలు ఉంటాయి. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల వారు బలహీనంగా మారుతారు. జన్యుపరమైన సమస్యలతోపాటు పోషక లోపాలు గల బిడ్డలు జన్మించడం, గర్భస్రావాలు, మాతాశిశు మరణాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దంపతుల నడుమ అవగాహన లోపంతో కలహాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం, కుటుంబ హింస, లైంగిక హింస, ఇంకా అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
చట్టాలున్నా..
బాల్య వివాహాల నిషేధ చట్టం బ్రిటిష్ కాలం 1929నుంచి అమల్లో ఉంది. ఇందులో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006ను రూపొందించింది. దీని ప్రకారం వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21ఏళ్లు నిండితేనే వివాహం చేయాలి. అంతకంటే తక్కువ వయసులో వివాహం చేయడాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు. బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసేవారు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా.. కానిపక్షంలో రెండు విధించవచ్చు. ఇరుపక్షాల తల్లిదండ్రులు, బంధువులు, సంరక్షకులు, పురోహితులు, ఇరుగు పొరుగు వారు అటువంటి వివాహాలు కుదిర్చేందు కు బాధ్యత వహించే పెళ్లి సంఘాలు, వివాహానికి హాజరైన వారంతా నిందితులుగా గుర్తించబడతారు. బాల్య వివాహాల నిరోధానికి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఆరు అంచెల అధికారులతో (సీఎంపీవో) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధానాధికారి, జిల్లా స్థాయిలో కలెక్టర్, ప్రాం తీయ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ/గ్రామ కార్యదర్శులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
ఎవరికి ఫిర్యాదు చేయాలి
జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 100, చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్‌చేసి చెప్పవచ్చు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా సమగ్ర బాలల సంరక్షణాధికారి, తహసీల్దార్, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు సమాచారం అందించవచ్చు.
తల్లిదండ్రుల్లో మార్పురావాలి
బాధ్యత తీర్చుకునే పేరుతో బాల్య వివాహం చేయడం చట్ట విరుద్ధం. దీనివల్ల ఆడపిల్ల భవిష్యత్ నాశనమవుతుం ది. తెలిసీ, తెలియని వయసులో పెళ్లి చేసి వారి జీవితాలను నాశనం చేయరాదు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. ఈ వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి.
– బి.సురేష్, డీసీపీవో
Comments
Please login to add a commentAdd a comment