Published
Sun, Aug 14 2016 11:29 PM
| Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
బాల్య వివాహానికి యత్నం
– అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
తోటపల్లిగూడూరు : కొన్ని గంటల వ్యవధిలో పెద్దలు నిర్వహించనున్న ఓ బాల్య వివాహాన్ని ఆదివారం ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని చింతోపులో జరిగింది. చింతోపు బీసీ కాలనీకి చెందిన పత్తెం మల్లికార్జున్, శిరీషా దంపతుల కుమార్తె (16)కు తుమ్మలపెంటకు చెందిన నరేంద్రబాబుతో ఆదివారం రాత్రి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే చింతోపులో ఓ మైనర్ బాలికకు పెళ్లి జరుగుతుందని ఐసీడీఎస్ అధికారులకు స్థానికులు కొందరు సమాచారం అందించారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఇందుకూరుపేట ఐసీడీఎస్ సీడీపీఓ శారదాకుమారి తన సిబ్బందితో కలిసి చింతోపు బీసీ కాలనీకి వెళ్లి వివరాలు సేకరించారు. పెళ్లి నిశ్చయించిన బాలికకు 16 ఏళ్ల లోపే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదంటూ అధికారులు మైనర్ బాలిక తల్లిదండ్రులను ఆదేశించారు. అయితే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని మరి కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లిని ఆపొద్దంటూ బాలిక తల్లిదండ్రులు ఐసీడీఎస్ అధికారులతో మొరపెట్టుకున్నారు. అయినా మైనర్ బాలికకు పెళ్లి చేయడం చట్ట రీత్యా నేరమని, అందుకు ఒప్పుకునేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పెళ్లి సమయానికి నిశ్చతార్థం చేసుకుని మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేయాలని వారు ఆ బాలిక తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. కాదని పెళ్లి చేస్తే అందరూ కటకటాల్లోకి వెళ్లాల్సివస్తుందని హెచ్చరించారు.