
బాలిక ప్రాణం తీసిన బాల్య వివాహం
14 ఏళ్ల వయస్సులో పెళ్లి 16 ఏళ్లకు గర్భిణి
కాన్పు అయిన 16 రోజులకు మృతిచెందిన బాలిక
దగదర్తి : బాల్య వివాహం ఓ బాలిక ప్రాణాలు తీసింది. 14 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడం ఆ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసింది. 16 ఏళ్ల వయస్సులోనే గర్భిణి వచ్చింది. కాన్పు అయిన 16 రోజుల్లో ఆ బాలిక మౌనిక (16) మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని వెలుపోడు పంచాయతీ మజరా కామినేనిపాళెంలో గురువారం చోటుచేసుకుంది. రోజుల పసికూన అమ్మ ఒడికోల్పోయాడు. కామినేనిపాళెంకు చెందిన వంకదారి మాల్యాద్రి, ధనలక్ష్మీ దంపతుల కుమార్తె మౌనికను అదే గ్రామానికి చెందిన కండే రాము, జయమ్మ దంపతుల రెండో కుమారుడు చిన హజరత్తయ్యకు ఇచ్చి ఏడాదిన్నర కిందట వివాహం చేశారు.
మొదటిలో సజావుగా సాగిన కాపురం ఆరు నెలలకే అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో మౌనిక గర్భందాల్చిన మూడు నెలలకే అత్తమామలు పుట్టింటికి పంపినారన్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల సంరక్షణలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఈ నెల 13వ తేదీన నెల్లూరు జూబ్లి హాస్పటల్‌లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి వైద్యులు పురుడుపోశారన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మౌనిక కళ్లు తిరుగుతున్నాయి అని పడిపోవడంతో హుటాహుటిన వైద్యపరీక్షలకు తరలిస్తుండగా కొడవలూరు మండలం రాజుపాళెం సమీపంలోకి వెళ్లేటప్పటికి మృతి చెందిందన్నారు. అనంతరం తల్లిదండ్రులు మౌనిక మృతదేహాన్ని అత్తాంటికి చేర్చగా అత్తమామలు, భర్త ఇళ్లు వదిలి పరారయ్యారని చెప్పారు. ఉదయం వైద్యపరీక్షలకు భర్త చిన హజరత్తయ్య కూడ వచ్చాడని చెప్పారు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
పదో తరగతి చదువుతుండగనే వివాహం..
టెన్‌త చదివే సమయంలోనే మౌనికకు వివాహం చేశారు. చిన్నతనంలోనే వివాహమైన మౌనిక మృతి చెందడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోగ్య సిబ్బంది సరైన వైద్యం అందించకనా లేక పోషకాహార లోపమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భారతీరెడ్డిని వివరణ కోరగా మౌనిక గర్భం ధరించిన నాటి నుంచి మరణించనంత వరకు వైద్యపరీక్షలు చేపట్టిన రికార్డులను పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు.