బాబూ.. గుక్కెడు నీళ్లివ్వు!
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబుకు స్వాగతం. మాగోడు నీకు తెలియంది కాదు. అయినా సరే తీరని మా సమస్యలు మరొక్కమారు మీదృష్టికి తెస్తున్నాం. పడమటి ప్రాంతంలోని 36 మండలాల పరిధిలో రోజురోజుకూ తాగునీటి సమస్య పెరుగుతోంది. వానంకాలంలోనూ వేసవి తరహాలో కష్టాలు తప్పడం లేదు. వేలాది బోరుబావులు ఎండిపోయాయి. పంచాయత్లీ, మున్సిపాలిటీల్లో సక్రమంగా నీళ్లివ్వడం లేదు.
నీటిసరఫరా పేరుతో వచ్చిన డబ్బులూ వాల్లే తింటుం డరు. ఏమన్నా అంటే నీళ్లే ఇవ్వమంటున్నరు. అది కూడా డిసెంబర్ దాకనే ఇస్తరంట. మల్ల గవర్నమెంటు వాల్లే ఇవ్వాల. మాతో కాదని చెబుతావుండరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బిందెడు నీళ్లు మూడు రూపాయలు పెట్టి కొంటావుండం. ఇలా ఎన్నాళ్లో తెలియడంలేదు. కడుపునిండా అన్నం తినడం సంగతి దేవుడెరుగు నీళ్లు తాగడమే గగనంగావుంది.
అధికారులనడిగితే వర్షాలు లేక వేలబోర్లు ఎండిపోయినయి అంటుండరు. భూగర్భజలాలు లోతుకు పోతాండయని తెలిసినా మన తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసక అమ్ముకోవడం మానలేదు. అధికారం మనదైనపుడు అధికారులు మాత్రం ఏం చేస్తరు పాపం. అంతకుముందు తొమ్మిదేండ్ల పాటు నిన్ను ముఖ్యమంత్రిని జేసుకున్నం. రాష్టం సంగతి దేవుడెరుగు జిల్లా తాగునీటి సమస్య తీరుతుందిలే అనుకున్నెం. కానీ మా తాగునీటి సమస్య తీరనేలేదు. రోజురోజుకూ వానలూ తగ్గిపోయి నీటిమట్టం పడిపాయ.
ఇప్పుడు బోర్లన్నీ వట్టిపోయి పడమటి ప్రాంతం ఎడారిమాదిరై పోతాంది. పంటలులేవు, పైర్లులేవు. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లేకరువాయ. ఇప్పటికే చాలామంది జనం వలసలు పోయిరి. జిల్లా తాగునీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా, కండలేరు నుంచి నీళ్లు రావాల్సిందే అంటావుండరు. ఈ దఫా ముఖ్యమంత్రిని చేస్తే జిల్లాలో నీటిసమస్య తీరుస్తానని ఎన్నికలముందు మాటిచ్చినవు. ఎన్నన్నా మనోడివి కదా కొంతయినా ప్రేముంటదిలే అని మల్లీ నమ్మి ఓట్లేసినం. నీటి సమస్య తీరుస్తావని ఆశగా ఉన్నం.
హంద్రీ-నీవా పూర్తి కావాలంటే * 4,500 కోట్లు అవసరమైతే కేవలం * 750 కోట్లే ఇవ్వడం బాధ కలిగించింది. ఆ డబ్బు కాంట్రాక్టర్ పాతబకాయిలకే సరిపోవంట. ఇక హంద్రీ-నీవాకు నిధులెప్పుడిస్తవు, పనులలెప్పుడు చేయిస్తవు. వాటర్‌గ్రిడ్ సంగతేంది. ఇదంతా జరిగేది కాదన్న అనుమానం తలెత్తుతాంది. ఇక కండలేరు ఊసేలేదు. అప్పుడెప్పుడో మన పెద్దమనిషి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పనులకు టెండర్లు పిలిస్తే వాటినీ నిలిపేశారంట. అసలే మీకు రైతు వ్యతిరేకి అనే పేరుంది.
ఈ దఫా అయినా ఆ పేరు పోగొట్టుకుంటావులే అనుకుంటే మల్లీ మొదటికొచ్చావు. రుణమాఫీ సక్రమంగా చేయక అందరినీ మోసగిం చావు. ఒక్కోరైతుకు మూడు వేలు, ఆరు వేలు వచ్చింది. బ్యాంకులు అప్పులివ్వలేదు, మా పంటలకు బీమా రాదంట. ఇక మహిళలకు రుణమాఫీ లేదు, రుణాలు లేవు, పదివేలు ఇస్తానన్న మాట నెరవేర్చలేదు. ఉద్యానవన రైతులనూ మోసగించావు. జిల్లాను మిల్క్‌జిల్లా చేస్తానన్నావు. డెయిరీల ఏర్పాటన్నావు. వాటికి * 500 కోట్లు అవసరమంట.
పైసా ఇవ్వకుండా మిల్క్‌జిల్లాను ఎలా చేస్తావు? చిత్తూరు నుంచి అటు బెంగుళూరు, ఇటు తిరుపతికి ఫోర్‌లేన్ రోడ్లన్నావు. వీటికి * 3 నుంచి 4 వేల కోట్లు అవసరమంట. అన్నీ మాటలతో కావుకదా..! ఇంకా చాలా వున్నాయి. చిత్తూరుకు మెడికల్‌కాలేజీ కావాలి, స్పెషల్ ఎకనమిక్ జోన్ చేయాలి. ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలి. రైల్వేలైన్ పై ఓవర్‌బ్రిడ్జీలు కావాలి ఇలా.. కానీ నిన్ను నమ్మి ఏదీ అడగలేని పరిస్థితి. ఏదడిగినా కాదనవని తెలుసు. అట్టని చేయవనీ తెలుసు. అవన్నీ ఎందుకులే బాబూ.. ముందు జనానికి గుక్కెడు నీళ్లిచ్చే సంగతి చూడు. జిల్లా ప్రజల గొంతులెండకుండా చూడు. జనం దృష్టిలో మోసగాడిగా మిగలకు. జిల్లాకు చెడ్డపేరు తేకు.
- ఇట్లు చిత్తూరు జిల్లా ప్రజలు