అవినీతిలో పోటీపడుతున్న టీడీపీ నేతలు | Chittoor TDP Leaders Corruption Dpecial Story | Sakshi
Sakshi News home page

అవినీతిలో పోటీపడుతున్న టీడీపీ నేతలు

Published Sat, Jan 5 2019 12:01 PM | Last Updated on Sat, Jan 5 2019 12:38 PM

Chittoor TDP Leaders Corruption Dpecial Story - Sakshi

చిత్తూరు మండలం ఆనగల్లు వద్ద ఇసుక అక్రమ తరలింపు

చిత్తూరు నియోజకవర్గం అధికార పార్టీ అవినీతికి కేరాఫ్‌గా మారింది. గడిచిన నాలుగున్నరేళ్లకు పైగా కాలవ్యవధిలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్రజాసొమ్మును దోపిడీ చేశారు. పదవులను అడ్డం పెట్టుకుని అవినీతిలో మునిగితేలారు. ఇక్క డ అవినీతిపై అధికారులే తెల్లబోయి సర్కారుకు నివేదిక సమర్పించారు. టీడీపీ పగ్గాలు చేపట్టాక ఇప్పటివరకూ రూ.424కోట్లకు పైగా వివిధ రూపాల్లో వీరు జేబుల్లోకి చేరిందనే సమాచారం నివ్వెరపరుస్తుంది. అవినీతిలో ఇక్కడి అగ్రనేతలు పోటీపడ్డారు. ఎమ్మెల్యే మొదలుకుని డీసీసీబీ చైర్మన్‌ వరకూ నేతలు అధికారాన్ని ఉపయోగించుని అక్రమాలకు ఒడిగట్టారు. ఇసుక అక్రమ తవ్వకాల నుంచి మరుగుదొడ్ల వరకూ ఏదీ వీరి దృష్టిపథాన్ని తప్పించుకోలేదు. సర్కారు నిధులతో సొంత పనులూ చక్కబెట్టుకున్నారు. ద్వితీయ స్థాయి నాయకులూ ఇదే బాటను అనుసరించడంతో చిత్తూరు నియోజకవర్గంలో దోపీడీదే పైచేయి అయ్యింది.    –సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌: అత్తసొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా తయారైంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిస్థితి. ఈ బ్యాంకులోని కోట్లాది రూపాయల రైతుల సొమ్మును డీసీసీబీ చైర్మన్‌ అమాస రాజశేఖరరెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు వినియోగించుకుంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన రూ.1 కోటి  రాష్ట్ర అభివృద్ధికంటూ సీఎం ఫండ్‌కు సమర్పించారు. దీనికి  పాలకవర్గం ఆమోదం లేదు. సీఎం ఫండ్‌కు అందించడంతో పాలకవర్గ సభ్యుల్లో భేదాభిప్రాయాలు కూడా వచ్చాయి.  అప్పటి వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. డీసీసీబీ కార్యాలయ ఆవరణలో వాస్తు దోషం పేరుతో రూ.25లక్షలు ఖర్చుచేశారు. కుప్పంలో సీసీ కెమెరాల ఏర్పాటుకంటూ రూ.1 కోటి  ధారాదత్తం చేశారు. 2018 ఫిబ్రవరికి డీసీసీబీ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ఈ పాలక వర్గాన్ని కొనసాగించేందుకే చైర్మన్‌ ఇలా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు పాలకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీసీసీబీకి చెందిన పాత భవనాన్ని ఎమ్మెల్సీ దొరబాబుకు పాలకవర్గం సమ్మతి లేకుండానే లీజుకు ఇచ్చారు. ఈ భవనం కేంద్ర సహకార బ్యాంకు ఎదురుగా ఉండడం గమనార్హం. ఎమ్మెల్సీకి ఆ భవనాన్ని ఇచ్చేందుకు లక్షల రూపాయల నిధులు వెచ్చించి మరమ్మతులు చేయించారు. ఆపై అప్పగించారు. టీడీపీ ప్రభుత్వంపై స్వామి భక్తిని చాటుకున్నారు.

గేటు వసూలులో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
చిత్తూరు నగరం వేలాది మంది రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కేంద్రం. నగరంలో ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్, కొంగారెడ్డిపల్లి, సంతపేట, గిరింపేటలోని మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తుం టారు. ఈ మార్కెట్‌కు గుడిపాల, యాదమర్రి, తవణంపల్లి, చిత్తూరు రూరల్, ఐరాల, పూతలపట్టు, పెనుమూరు, జీడీ నెల్లూరు మండలాల నుంచి వేలాది మంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. 2వేల మందికిపైగా స్థానికులు తోపుడు బండ్లపై పానీపూరీ, పండ్లు, చిన్న పరికరాలు, ఆటవస్తువులు విక్రయించగా వచ్చిన ఆదాయంతో పొట్టనింపుకుంటుంటారు. నిబంధనల ప్రకారం మార్కెట్‌ గేటు కింద చిరు వ్యాపారుల నుంచి రూ.10 లేదా రూ.20 మించి వసూలు చేయటానికి వీల్లేదు. ఎమ్మెల్యే సత్యప్రభ అనుచరులు చలపతి, శ్రీధర్‌ అధికారుల అండతో రూ.35 నుంచి రూ.2,500 వరకు దౌర్జన్యంగా వసూల్లు చేసుకుంటున్నారు. 

బినామీ పేర్లతో దంపతులు స్వాహా
చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, భర్త చంద్రప్రకాష్‌ దౌర్జ్యంగా టెండర్లు దక్కించుకుని బినామీ పేర్లతో పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బంగారుపాళెం నుంచి గుడిపాల మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు సుమారు 35 కి.మీ వరకు రూ.306 కోట్లతో జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను దక్కించుకునేందు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన కాంట్రా క్టర్లు పోటీపడ్డారు. జెడ్పీచైర్‌ పర్సన్‌ తన అధికార బలంతో ఎవ్వరికీ టెండర్‌ దక్కకుండా ప్రణాళిక రచించారు. బినామీ పేర్లతో పనులు సొంతం చేసుకున్నారు.  చిత్తూరు నగరంలో రూ.2.8 కోట్లతో నూతనంగా జిల్లా పరిషత్‌ సమావేశ భవనాన్ని నిర్మిస్తున్నారు. జెడ్పీచైర్‌ పర్సన్‌  దీన్ని బినామీ పేరుతో దక్కించుకుని పనులు చేస్తున్నారు. ఈ రెండు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కన్నెత్తి చూడటానికి సాహసించడం లేదు. జెడ్పీచైర్‌పర్సన్‌ ఇష్టారాజ్యం గా పనులు చేస్తున్నారు. జాతీయరహదారి పనులు ఆలస్యం అయ్యాయని ఇటీవల కలెక్టర్‌ ప్రద్యుమ్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీలో ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో భారీ ఎత్తున మామూళ్లు వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అవినీతి తారస్థాయికి చేరింది
జిల్లాలో అధికార పార్టీ నాయకులు వారి వారి స్థాయిల్లో అవినీతికి పాల్పడుతున్నారు. బినామీ భూములు మొదలుకొని, గ్రానైట్‌ క్వారీలు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను అమ్ముకోవడంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.    – పి.చైతన్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు

అన్నింటా టీడీపీ జోక్యం
అధికార పార్టీ నాయకులు ఇక్కడ, అక్కడ అనే భేదం లేకుండా అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్ప డుతున్నారు. సీసీ రోడ్లు, ఇతర కాంట్రాక్ట్‌ పనులను చేజిక్కించుకుని నాణ్యత లేకుండా పనులు పూర్తి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.    – నాగరాజన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement