సాక్షి, అమరావతిబ్యూరో: ఉయ్యూరు సర్కిల్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లున్నాయి. ఉయ్యూరు పట్టణం, రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లు ఈ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. సీఐ నాగప్రసాద్ ఇక్కడికి కొత్తగా వచ్చారు. ఉయ్యూరు, పమిడిముక్కల స్టేషన్లలో పాత ఎస్‌ఐలే కొనసాగుతున్నారు. అయితే ఇక్కడి ఎస్‌ఐలకు సీఐకి మధ్య సఖ్యత లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారం క్రితం ఉయ్యూరు టౌన్ ఎస్‌ఐ గురుప్రకాష్, పమిడిముక్కల ఎస్‌ఐ శ్రీనివాస్‌లు విజయవాడ శాంతిభద్రతలడీసీపీ–1ని కలిసి సీఐపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చోరీల రికవరీ కేసుల విషయంలో సీఐ, ఎస్‌ఐలకు మధ్య మాటలు యుద్ధం ముదిరి వివాదం చెలరేగిందని తెలుస్తోంది. సర్కిల్ అధికారిని ఓవర్‌లుక్ చేసి ఎస్‌ఐలు వ్యవహరిస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సర్కిల్ పరిధిలోని స్టేషన్లలో గందరగోళం నెలకొంటోంది. అధికారి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎవరికి వారే వర్గాలుగా వీడి ఆధిపత్యాన్ని చలాయించే పనిపైనే శ్రద్ధ చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి.
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..
అధికారుల మధ్య ఆధిపత్య పోరులో సిబ్బంది ‘ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల’ మాదిరిగా నలిగిపోతున్నారు. క్రైం విభాగంలో రికవరీ కోసం పనిచేసే కానిస్టేబుళ్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పమిడిముక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల 50 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఈ రికవరీ క్రమంలో సెల్ ఫోన్లతో పాటు సెల్‌ఫోన్లు తీసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి ఆఫ్ ది రికార్డ్ వసూళ్లు చేసినట్లు సమాచారం. ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోను గతంలో జరిగిన రికవరీల్లోనూ ఇదే పరిస్థితి. జాతీయ రహదారిపై రెండు నెలల క్రితం కారు ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటనలోనూ లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు వినికిడి. ఈ అంశాల్లో సర్కిల్ అధికారికి, ఎస్‌ఐలకు మధ్య వివాదం తలెత్తడంతో ఎవరికి వారే సేఫ్ సైడ్ ఉండేందుకు సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలున్నాయి. రికవరీలకు సంబంధించి గట్టిగా ప్రశ్నించిన క్రమంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆ కానిస్టేబుల్ మంటాడలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు కానిస్టేబుళ్లు స్థానచలనాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.
పట్టించుకోని ఉన్నతాధికారులు..
స్టేషన్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈస్ట్ ఏసీపీ పరిధిలో ఉన్న ఈ సర్కిల్ కార్యాలయ పరిధిలో స్టేషన్ల తనిఖీకి నాలుగు నెలలుగా ఏ అధికారి రాని పరిస్థితి. ఈస్ట్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ అధికారి ఉయ్యూరు వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ ఎవరి ఇష్టం వారిదే అన్నట్లు ఉంది. ఇప్పటికైనా ‘ఉయ్యూరు’ను నగర పోలీస్ కమిషనర్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment