సాక్షి, అమరావతి/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుల్లారావు, నారాయణ, నరసింహారావులపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120/బిలతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గురువారం మంగళగిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు)
797 మంది తెల్లరేషన్ కార్డుదారులు.. 761 ఎకరాల కొనుగోలు
రాజధాని రాకముందే రంగంలోకి దిగిన బెల్లంకొండ నరసింహారావు అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా లాక్కుంటుందని భయపెట్టాడు. నరసింహారావు తన పేరిట ఉన్న 99 సెంట్ల అసైన్డ్ భూమిని బలవంతంగా రాయించుకుని భూ సమీకరణ కింద పరిహారం కూడా పొందినట్లు వెంకటపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉందని ఆధారాలు ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో 761 ఎకరాలు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో నిర్ధారణ అయింది. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.38,56,84,000 ఉంటుందని తేలింది. (చదవండి: తెల్లబోయే దోపిడీ)
తెల్ల రేషన్‌కార్డుదారుల పేరుతో బినామీలు కొన్న భూములు
►అమరావతి మండలంలో 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 129 ఎకరాలు కొన్నారు.
►పెదకాకాని మండలంలో 43 మంది 40 ఎకరాలు కొన్నారు.
►తాడికొండలో 188 మంది 190 ఎకరాలు కొన్నారు.
►తుళ్లూరులో 238 మంది 242 ఎకరాలు కొనుగోలు చేశారు.
►మంగళగిరిలో 148 మంది 134 ఎకరాలు కొన్నారు.
►తాడేపల్లి మండలంలో 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు 24 ఎకరాలు కొనుగోలు చేశారు.
►797 తెల్ల రేషన్ కార్డుదారుల్లో 268 మందికి పాన్ కార్డు ఉంది.
►761 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ రూ 38.50 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.220 కోట్లకుపైగా ఉంటుంది.
నాలుగు బృందాలతో విచారణ..
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు సీఐడీ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం అసైన్ట్ భూములపై విచారిస్తుండగా మరో బృందం తెల్ల రేషన్ కార్డులపై దర్యాప్తు జరుపుతోంది. రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నవారికి సంబంధించి మరో బృందం వివరాలు సేకరిస్తుండగా నాలుగో బృందం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను విచారిస్తోంది. (చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!)
(చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..)
Comments
Please login to add a commentAdd a comment