సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయులు లేరు.. కానీ నెలవారీ జీతాలు మాత్రం డ్రా చేశారు. ఇలా ఒక నెల, రెండు నెలలో కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు ముగ్గురు టీచర్లు లేకుండానే వేతనాలను కైంకర్యం చేశారు. తాండూరులోని దార్‌ఉల్‌ఉమ్ ఎయిడెడ్ పాఠశాలలో జరిగిన తంతు ఇది. 1994-97 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగిన అనంతరం ఆ పాఠశాలను విద్యాశాఖ అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయగా.. సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.
వెలుగు చూసిందిలా..
టీచర్లు లేనప్పటికీ వారి సర్టిఫికెట్లను చూపిస్తే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేతన బిల్లులు తయారు చేసి విద్యాశాఖకు సమర్పించడం.. అనంతరం అధికారులను ప్రలోభపెట్టడంతో వ్యవహారం సాఫీగా సాగింది. సర్టిఫికెట్లలో చూపిన టీచర్లకు సర్కారు కొలువులు వచ్చాయి. ఒకే పేరుతో రెండు చోట్ల వేతనాలు విడుదల చేయడాన్ని గమనించిన ఖజానాశాఖ అధికారులు విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా అసలు కథ వెలుగు చూసింది.
అందరూ బాధ్యులే..!
సాధారణంగా ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉద్యోగులకు నెలవారీ వేతనాలు మంజూరు చేసే ప్రక్రియలో ఉపవిద్యాధికారితో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని పర్యవేక్షకులు సదరు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అసలు గుట్టు తెలిసినప్పటికీ విషయం బయటకి రాకుండా జాగ్రత్తగా ఫైళ్లను ఆమోదించారు. ఇలా రూ.6.5 లక్షలు డ్రా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో సదరు అధికారులందరినీ ప్రస్తావిస్తూ డీఈఓ సోమిరెడ్డి ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలంటూ సీఐడీ పోలీసులు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి లేఖ రాశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రమేయమున్న వారందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వేతనాల స్వాహాపై సీఐడీ విచారణ
Published Wed, Dec 18 2013 3:34 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement
Advertisement