సీఐడీకి ‘బొమ్మరిల్లు’ కేసు
కాశీబుగ్గ పోలీసుల నుంచి రికార్డుల స్వాధీనం
పలాస : పలాస-కాశీబుగ్గ పట్టణంలో బొమ్మరిల్లు పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన కేసును సీఐడీ పోలీసులకు బదిలీ అయింది. ఈ మేరకు సీఐడీ సీఐ బి.స్వామినాయుడు, నర్సింగరావు శుక్రవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఏడాది క్రితం 13 వేల మంది ఖాతాదారులకు శఠగోపం పెట్టి, సుమారు రూ.7 కోట్ల సొమ్మును కొల్లగొట్టిన బొమ్మరిల్లు యజమాని రోయల రాజారావుపై బాధితుల్లో ఒకరైన పొందూరు కూర్మారావు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ సీఐ రామకృష్ణ వారిపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. తొలుత కొంతమంది ఖాతాదారులు బొమ్మరిల్లు యాజమాన్యంపై విశాఖపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నలుగురు డెరైక్టర్లను అరెస్టు చేసిన విషయం వెలుగులోకి రావడంతో పలాస-కాశీబుగ్గ పట్టణంలో బొమ్మరిల్లు బ్రాంచిపై కలకలం రేగింది.
ఈ సంస్థకు ఏలూరు సమీపంలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన ఆర్‌ఆర్ రాజా ఎమ్‌డీగా ఉన్న సమయంలో పలాసలో 2012 ఫిబ్రవరి ఐదో తేదీన బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ పరిధిలో ఒక ఏబీఎంతో పాటు ఎనిమిది మంది ఏజెంట్లు పనిచేశారు. పూండి ప్రాంతంలో కళింగరాజ్యం వెంచర్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్లాట్లను చూపిస్తూ పది శాతం వడ్డీతో ఏడాదికే మొత్తం సొమ్ము తిరిగి చెల్లిస్తామని సామాన్య ప్రజల నుంచి అత్యధిక శాతం డబ్బులు వసూలు చేశారు. అయితే గడువు పూర్తయినా వారికి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఐడీ పోలీసులు వీటిపై దృష్టిసారించి కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు.