వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ...
సినిమా వెనుక స్టోరీ - 36
కేరళ.... చాలా రోజులుగా ‘ఆర్య’ షూటింగ్ అక్కడే జరుగుతోంది. షెడ్యూలు ప్రకారం మరునాటితో షూటింగ్ పూర్తయిపోవాలి. అందరికీ టిక్కెట్స్ కూడా రిజర్వ్ అయి పోయాయి. కానీ ఇక్కడేమో 46 షాట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక్క రోజులో 46 షాట్లు... ఎలా సాధ్యం?!
నిర్మాత ‘దిల్’ రాజుకి ఒకటే టెన్షన్. ఆ షాట్స్‌లో ఒక్కటి తీయకపోయినా అంతా వేస్ట్. టిక్కెట్లు అన్నీ క్యాన్సిల్ చేసి, ఇక్కడే ఇంకో రోజు ఉండి పూర్తి చేసి బయలుదేరాలి. అంతలో ‘దిల్’ రాజు దగ్గరకొచ్చాడు దర్శకుడు సుకుమార్. అతని పక్కనే అసిస్టెంట్ డెరైక్టర్ భాస్కర్.
‘‘ఏంటి సుక్కూ... మన పరిస్థితి?’’ ఆందోళనగా అడిగాడు ‘దిల్’ రాజు!
సుకుమార్ ఏదో చెప్పబోతుంటే, భాస్కర్ తానే కల్పించుకుని ‘‘డోంట్‌వర్రీ సార్! మేమిద్దరం నైట్ అంతా కూర్చుని ప్లాన్ చేసి, రేపు 46 షాట్లు పూర్తి చేసేస్తాం’’ అన్నాడు. పేరుకి అసిస్టెంట్ డెరైక్టర్ కానీ, సుకుమార్‌కి భాస్కర్ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ నిర్మాత ‘ఎడిటర్’ మోహన్ సంస్థలో కలిసి పనిచేశారు. ‘ఆర్య’తో సుకుమార్ డెరైక్టర్ అవుతుంటే ఎక్కువ సంబరపడింది భాస్కరే!
ఆ రాత్రంతా సుకుమార్, భాస్కర్ డిస్కస్ చేసుకుని, ఓ షీట్ తయారు చేశారు. ఆ షీట్ ప్రకారం 46 షాట్లూ సింగిల్ డేలో తీసేశారు. భాస్కర్‌లోని షార్ప్నెస్కి ‘దిల్’ రాజు ఫిదా అయిపో యాడు. ‘‘నీ ప్లానింగ్ నచ్చింది భాస్కర్. నిన్ను నేనే డెరైక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తాను’’ అంటూ వరమిచ్చేశాడు.
‘దిల్’ రాజు ఇప్పుడు ‘భద్ర’ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీనుకి డెరైక్షన్ చాన్స. ఆ సినిమా టైమ్‌లోనే ‘దిల్’ రాజు ఓ ఫారిన్ మూవీ చూశాడు. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇలాంటిది తెలుగులో చేస్తే అదిరిపోతుందనిపించింది.
భాస్కర్‌ను పిలిచి, ‘హౌ టు లూజ్ ఎ గై ఇన్ టెన్ డేస్’ మూవీ డీవీడీ చేతిలో పెట్టాడు. ‘‘దీన్ని బేస్ చేసుకుని స్క్రిప్టు చేసుకో. ‘భద్ర’ తరువాత ఇమ్మీడి యట్గా మొదలుపెడదాం’’ అని చెప్పేశాడు. భాస్కర్ హుషారుగా వెళ్లిపోయాడు. హుషారుగా డీవీడీతో వెళ్లినవాడు, ఇంకా హుషారుగా స్క్రిప్టుతో వచ్చాడు. కథంతా విని ‘‘వెరీ గుడ్’’ అన్నాడు ‘దిల్’ రాజు. సెకెండాఫ్‌లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అవి చేసేస్తే షూటింగ్‌కి వెళ్లిపోవచ్చు. కానీ భాస్కర్‌కి ఏదో అసంతృప్తి.
సెకెండాఫ్ ఇంకా చాలా బాగా రావాలనిపిస్తోంది. ఎంత వర్కవుట్ చేసినా కరెక్ట్ అవుట్‌పుట్ రావడం లేదు. ఇలా అసంతృప్తి పడే కన్నా, ఇంకో కథ ఎంచు కుంటే బెటర్! ‘దిల్’ రాజుకి అదే చెప్పే శాడు. భాస్కర్ టాలెంట్ తెలుసు కాబట్టి, రాజు కూడా ఫ్రీడమ్ ఇచ్చేశాడు. ‘‘వారం రోజుల్లో కొత్త కథతో వస్తా’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు భాస్కర్.
1997లో అడయార్ ఫిల్మ్ ఇన్స్టి ట్యూట్లో డెరైక్షన్ కోర్సు చేస్తున్నప్ప ట్నుంచీ భాస్కర్‌ను ఓ కథ వెంటాడు తోంది. సక్సెస్ఫుల్ ఫాదర్‌ని అనుకుంటూ కొడుకు లైఫ్‌ను డిస్టర్బ చేసే ఒక తండ్రి- తండ్రి ఫీల్ కాకూడదని తనలో తాను బర్న్ అయిపోయే ఒక కొడుకు- వీళ్లద్దరి మధ్యలో- ఎటువంటి ఫీలింగ్సూ లేకుండా తను అనుకున్నది ఎంజాయ్ చేసే ఒక అమ్మాయి- ఈ ముగ్గురితో ఓ కథ చేసుకున్నాడు భాస్కర్. దాన్ని ఇన్నేళ్ళ తరువాత బయటకు తీశాడు. అసోసియేట్ డెరైక్టర్ వాసువర్మతో కూర్చుని, దాన్ని బాగా చిత్రిక పట్టాడు.
‘దిల్’ రాజు కథ వింటున్నాడు. మధ్య మధ్యలో ఏదో ఒక డౌట్ అడిగే ఆయన దీనికి ఒక్క మాట మాట్లాడలేదు. సెలైంట్‌గా కథ విన్నాడు. కథ అయ్యాక కూడా చాలాసేపు అలా సెలైంట్‌గానే ఉండిపోయాడు. ఎప్పటికో తేరుకుని, భాస్కర్ ను గట్టిగా హగ్ చేసుకుని ‘‘మనమీ సినిమా చేస్తున్నాం’’ అనేశాడు.
చెన్నై వెళ్లాడు ‘దిల్’ రాజు. హీరో సిద్ధార్థ్ కలిశాడు. ‘నువ్వొస్తానంటే నేనొద్దం టానా’ హిట్‌తో మంచి క్రేజ్‌లో ఉన్న సిద్ధార్థ్‌కి జస్ట్ ఐడియా చెప్పాడు. ‘‘ సార్! నేను మొత్తం కథ కూడా వినను. ఎన్ని డేట్లు కావాలో చెప్పండి’’ అని ఉద్వేగపడి పోయాడు సిద్ధార్థ్.
ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్ ముందే ఫిక్స్. మదర్‌గా ఎవరైనా పాపులర్ నటి కావాలి. జయసుధ ఓకే.
కెమెరామ్యాన్‌గా విజయ్ సి. చక్రవర్తి డబుల్ ఓకే. ‘ఆర్య’కు రత్న వేలు కెమెరామ్యాన్ అయినా ఎక్కువ వర్క్ చేసింది విజయే. మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ ట్రిపుల్ ఓకే. డైలాగ్ రైటర్‌గా అబ్బూరి రవి కన్ఫర్మ్. ఇక, హీరోయిన్ పాత్ర ఒక్కటే బ్యాలెన్స్.
సింధూ తులానీ... ఇంకా చాలా ఆప్షన్లు. ఎవ్వరూ నచ్చడం లేదు. ‘హ్యాపీ’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఓ అమ్మాయి చేస్తోందని తెలిసి, సాంగ్ రష్ చూడడానికెళ్లారు రాజు, భాస్కర్. తీరా చూస్తే - ఆ అమ్మాయి జెనీలియా! శంకర్ మూవీ ‘బాయ్స్’తో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ అమ్మాయి కళ్లు చూడగానే భాస్కర్ ‘‘నా హాసిని ఈ అమ్మాయే’’ అని ఠకీమని అనేశాడు.
అంతా ఓకే. ఇంకా సరైన టైటిల్ దొరకలేదు. ఆ టైమ్‌లో వైవీయస్ చౌదరి ఆఫీసు నుంచి ఓ భారీ ఇన్విటేషన్ వచ్చింది. రామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘దేవదాసు’ తీస్తున్నాడు చౌదరి. ఆ ఇన్విటేషన్లో ఓ చోట ‘దిల్’ రాజు కళ్లు ఆగిపోయాయి. ఎస్... టైటిల్ దొరికేసింది.
గట్టిగా విజిలేస్తూ భాస్కర్‌కి ఫోన్ చేశాడు. ‘‘మన సినిమా టైటిల్ ‘బొమ్మరిల్లు’. వైవీయస్ చౌదరి బ్యానర్ పేరు అదే! వాళ్ల ఇన్విటేషన్ చూస్తుంటే ఐడియా వచ్చింది’’ సంబరపడిపోతూ చెప్పాడు. ‘‘టైటిల్ బావుంది. కానీ జస్టిఫికేషన్ ఎలా?’’ అని భాస్కర్ డౌట్.
‘‘బొమ్మరిల్లు అని పిల్లలు ఇసుకతో గూళ్లు కట్టుకుని ఆడుకుంటుంటారు. పిల్లలు తమకు నచ్చినట్లు తాము ‘బొమ్మరిల్లు’ కట్టుకుంటే వాళ్ల ఆనందమే వేరు. మన సినిమాలో హీరో ఫ్యామిలీ కూడా అందమైన బొమ్మరిల్లే కదా!’’ అన్నాడు రాజు.
టైటిల్‌కి సూపర్ రెస్పాన్స్. సినిమాకు కూడా సూపర్ క్రేజ్. ‘దిల్’, ‘ఆర్య’, ‘భద్ర’ లాంటి మూడు సూపర్హిట్ల తరువాత ‘దిల్’ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తోన్న నాలుగో సినిమా. దానికి తోడు హీరో సిద్ధార్థ్కున్న క్రేజ్.
యూనిట్ కూడా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే పనిచేస్తున్నారు. సిద్ధార్థ్ అయితే, క్యారెక్టర్లో పూర్తిగా లీనమైపోయాడు. ప్రకాశ్‌రాజ్‌తో బాగా అటాచ్మెంట్ రావడం కోసం ఆయన ఫ్లాట్‌కే వెళ్ళి, వారం రోజులు ఉండివచ్చాడు సిద్ధార్థ్.
క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటే బ్యాలెన్స్.. అదే సినిమాకు హార్ట్ అండ్ సోల్. ప్రకాశ్ రాజ్ రాత్రికి చెన్నై వెళ్లి పొద్దున్నే హైదరా బాద్ తిరిగి వచ్చేస్తానన్నాడు. వెళుతూ వెళుతూ సీన్ పేపర్ పట్టుకెళ్లాడు. ఫ్లయిట్లో కూర్చొని చదువుకుంటుంటే ఏం ఫీల్ కలగడం లేదు. ఏదో తేడాగా ఉంది!
‘దిల్’ రాజుకి ఫోన్ చేసి ‘‘నాకు స్టోరీ చెప్పినప్పుడు క్లైమాక్స్ చాలా ఫీల్‌తో ఉంది. ఈ స్క్రిప్ట్ పేపర్లో అంత డెప్త్ కనబడడం లేదు. ఒకరోజు టైమ్ తీసుకునైనా వర్క్ చేసి షూటింగ్కెళ్దాం’’ అన్నాడు. నెక్ట్స్ డే- ప్రకాశ్‌రాజ్ ఫ్లాట్‌లో మీటింగ్. సిద్ధార్థ్ , ‘దిల్’ రాజు, భాస్కర్, వాసువర్మ... ఇలా మెయిన్ టీమ్ అంతా ఉన్నారు. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే డిస్కషన్. అర్ధరాత్రి రెండయ్యింది... డిస్కషన్ కంప్లీట్ అయ్యేసరికి!
మరునాడు... నానక్‌రామ్‌గూడా రామా నాయుడు స్టూడియోలో వేసిన సెట్లో యూనిట్ అంతా రెడీగా ఉన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వచ్చాడు సిద్ధార్థ్. సీన్ అంతా బాగా ప్రిపేరయ్యి మరీ వచ్చాడు. కాసేపు రిహార్సల్స్ చేశాడు.
సరే... లంచ్ బ్రేక్ తర్వాత సీన్ తీద్దామని డిసైడయ్యారు. సరిగ్గా రెండున్నరకు కెమెరా స్టార్ట్ అయ్యింది. నాలుగున్నర నిమిషాల సీన్. సింగిల్ టేక్‌లో ఓకే.
ఆ సీన్లో లీనమైపోయి భాస్కర్ ఏడుస్తూనే ఉన్నాడు. అతను తేరుకోవ డానికి చాలా టైమ్ పట్టింది.
2006 ఆగస్టు 9.
ఆ రోజును ‘దిల్’ రాజు ఎప్పటికీ మరచిపోడు. తానెన్ని సినిమాలు తీసినా, బ్లాక్ బస్టర్లు సృష్టించినా - ‘బొమ్మరిల్లు’ తెచ్చిన పేరు ప్రఖ్యాతుల ముందు అవన్నీ దిగదుడుపే అంటాడాయన. 9 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందని అడిగితే ‘దిల్’ రాజు ఒక్కటే చెబుతాడు. ‘బొమ్మరిల్లు’ ఇచ్చిన సంతృప్తికి ఖరీదు కట్టే షరాబు లేడు.
దర్శకుడు భాస్కర్‌కి ఇంటిపేరై పోయిందీ సినిమా. భాస్కర్ నాన్న నటరాజన్ ‘బొమ్మరిల్లు’ చూసొచ్చి, కొడుకు చేతుల్ని ఆప్యాయంగా ఒత్తారు. అంతకు మించిన అవార్డు లేదంటారు భాస్కర్.
సిద్ధార్థ్‌కు సెకండ్ బ్లాక్‌బస్టర్.
జెనీలియాకు బిగ్ బ్రేక్.
‘అంతా నువ్వే చేశావు’, ‘వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’ లాంటి డైలాగ్స్ మొబైల్లో రింగ్‌టోన్స్‌గా కూడా పాపులర్.
‘యువచిత్ర’ సంస్థపై ‘గోరింటాకు’, ‘సీతామాలక్ష్మి’ లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ తీసిన ప్రముఖ నిర్మాత మురారికి ఈ కొత్త శతాబ్దపు సినిమాల్లో ఇది ఫేవరేట్ మూవీ. ‘శంకరాభరణం’, ‘స్వాతి ముత్యం’, ‘సాగరసంగమం’ లాంటి కళాఖండాలు తీసిన ఫేమస్ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు మనసు దోచుకున్న సినిమా కూడా ఇదే. ‘‘నా అభిరుచికి తగ్గ సినిమా ఇది. నేనిప్పుడు సినిమా తీస్తే ఇలాంటిదే తీస్తాను’’ అని ఏడిద కామెంట్ చేశారు. అది చాలు ‘బొమ్మరిల్లు’ మేడ్ హిస్టరీ అని చెప్పడానికి!
వెరీ ఇంట్రస్టింగ్
* ఇప్పటి టాప్ కమెడియన్ సప్తగిరి ఈ చిత్రానికి అసోసియేట్ డెరైక్టర్.
* తమిళంలో ‘సంతోష్ సుబ్రమణ్యం’ పేరుతో ‘ఎడిటర్’ మోహన్ వాళ్లబ్బాయ్ ‘జయం’ రవి హీరోగా రీమేక్ చేశారు. హిందీలో ‘ఇట్స్ మై లైఫ్’ పేరుతో రూపొందింది. రెండు భాషల్లోనూ జెనీలియానే హీరోయిన్.
* అవకాశం కుదిరితే భవిష్యత్తులో ‘బొమ్మరిల్లు’కి సీక్వెల్ చేసే ఉద్దేశం ‘దిల్’ రాజుకి ఉంది.
* ఈ చిత్రంలో సుదీప చేసిన బ్యూటీషియన్ క్యారెక్టర్‌కు భాస్కర్ చెల్లెలే ఇన్స్పిరేషన్.
- పులగం చిన్నారాయణ