స్మగ్లింగ్‌లో సిగరెట్లదే అగ్రస్థానం
గతేడాది రూ. 200 కోట్ల సిగరెట్ల పట్టివేత
5 కేజీల బంగారంతో రెండో స్థానంలో బంగారం
కాకినాడ రేవు ఆదాయం తగ్గి.. కృష్ణపట్నంలో పెరిగింది
సాక్షి, అమరావతి:
రాష్ట్రంలోకి అక్రమంగా తరలివస్తున్న వస్తువుల జాబితాల్లో మొదటి స్థానంలో సెగరెట్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బంగారం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ. 200 కోట్ల విలువైన సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గడిచిన ఏడాదిలో 39 సిగరెట్ల స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయని, సుమారు రూ. 198.6 కోట్ల విలువైన 6,000 కార్టన్ల విదేశీ సిగరెట్లను పట్టుకొని ధ్వంసం చేసినట్లు రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఖాదర్ రెహమాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో 5 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం రూ. 1.37 కోట్ల విలువైన 4.67 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌ను అరికట్టడం ద్వారా గతేడాది రూ. 311 కోట్ల అదనపు ఆదాయం కస్టమ్స్ శాఖకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
తగ్గిన కాకినాడ రేవు జోరు
బొగ్గు, ఎరువుల దిగుమతులు గణనీయంగా తగ్గడంతో కాకినాడ రేవు ఆదాయం బాగా పడిపోయింది. 2015–16లో రూ. 1,208 కోట్లుగా ఉన్న కస్టమ్స్ ఆదాయం 2016–17లో 8 శాతం తగ్గి రూ. 1,109 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో కృష్ణపట్నం ఆదాయంలో 24 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. కృష్ణపట్నం రేవు కస్టమ్స్ ఆదాయం రూ. 1,735 కోట్ల నుంచి రూ. 2,152 కోట్లకు పెరిగింది. పొగాకు, గ్రానైట్, మిర్చి, పత్తి ఎగుమతులలో 20 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం తో కృష్ణపట్నం ఆదాయం పెరిగింది. ఎగుమతిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా 150 శాతం పెరిగాయి. 2015–16లో ఎగుమతి ప్రోత్సాహకాలు (కస్టమ్ డ్యూటీ వెనక్కి ఇవ్వడం) రూ. 100 కోట్లుగా ఉంటే 2016–17లో ఈ మొత్తం రూ. 250 కోట్లు దాటింది.