గుంటూరు ఈస్ట్ : మ్యానిఫెస్టోల్లో లక్ష కబుర్లు చెప్పే రాజకీయ పార్టీ నాయకులు నేడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పెదవి విప్పకపోవడం అన్యాయమని సినీ నటుడు శివాజీ విమర్శించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ చేపట్టిన 48 గంటల దీక్ష పూర్తయిన అనంతరం ఆయన మంగళవారం మధ్యాహ్నం నుంచి దానిని ఆమరణ దీక్షగా కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇంతటితో ఆపేది లేదన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలోకి రావాలని కోరారు. బహిరంగంగా ముందుకు రావడానికి వీలులేని వారు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కేంద్రానికి మెసేజ్‌లు పంపాలని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా తాను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తన దీక్షను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలు, గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతమై దీక్షలు ప్రారంభిస్తారనే ఆశతోనే తాను దీక్షను ప్రారంభించానన్నారు.
తనకు ఏ పదవులూ అక్కర్లేదన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజి మాట్లాడుతూ నటుడు శివాజీ ఆరోగ్యం క్షీణించిందని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక బాలారామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కృష్ణ, జైభీమ్ కార్మిక సంక్షేమ సంఘ నాయకులు, ఆంధ్ర కృష్ణబలిజ సంఘం నాయకులు, దళిత బహుజన సమైక్య వేదిక నాయకులు ఉన్నారు.
మాలమహానాడు మహిళా కార్యవర్గ సభ్యులు బి.జోనికుమారి, కార్యవర్గ సభ్యులు శివాజీ దీక్షకు మద్దతు ప్రకటించారు. శివాజీ దీక్షను భగ్నం చేస్తే అవసరమైతే అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటామని అంటూ పెట్రోలు సీసాలు చూపించి హెచ్చరించారు.
ప్రత్యేక హోదాపై పెదవి విప్పరేం..? సినీనటుడు శివాజీ
Published Wed, May 6 2015 3:10 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement