బ్లాక్‌లో బ్లూ | City of parishad narayanammadi small family. Her husband's clothing store clerk | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లో బ్లూ

Published Mon, Oct 28 2013 2:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

City of parishad narayanammadi small family. Her husband's clothing store clerk

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగరంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నారాయణమ్మది చిన్న కుటుంబం. ఆమె భర్త వస్త్ర దుకాణంలో గుమాస్తా. ఈ కుటుంబం రేషన్ సరుకులపై ఆధారపడి జీవిస్తోంది. ప్రతినెలా సమీపంలోని ప్రభుత్వ చౌకదుకాణంలో బియ్యం, నూనెతో పాటు కిరోసిన్ కూడా తెచ్చుకుంటారు. కొన్ని నెలలుగా వారికి కిరోసిన్ ఇవ్వడం లేదు. దీనిపై డీలర్‌ను నారాయణమ్మ ప్రశ్నించగా స్టాక్ అయిపోయిందని చెప్పడంతో ఏం చేయలేక ఆమె అయోమయానికి గురైంది. ఇలాంటి వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. వీరికి కేటాయించిన కిరోసిన్ కోటాను రేషన్ డీలర్లు స్వాహా చేస్తున్నారు.
 
 జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ సొమ్ముస్వాహా చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. పేదలకు  చేరాల్సిన నీలి(బ్లూ) కిరోసిన్ నల్లబజారుకు తరలుతోంది. ఈ తంతు విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి  అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి పౌరసరఫరాల అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 19 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు ఉన్నారు.
 
 వీరికి ప్రతి నెలా వివిధ  ఆయిల్ కంపెనీల ద్వారా 1428 కిలోలీటర్లు కిరోసిన్ సరఫరా అవుతోంది. హోల్‌సేల్  కిరోసిన్ డీలర్ల ద్వారా జిల్లాలోని 1888 రేషన్ దుకాణాలకు సరఫరా
 చేస్తున్నారు. రేషన్‌డీలర్ల ద్వారా కార్డుదారులకు కేటాయించిన ప్రకారం కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది.
 కేటాయింపులో తిరకాసు ప్రతి రేషన్ డీలర్‌కు  కార్డు సంఖ్యను అనుసరించి కిరోసిన్ కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు పౌరసరఫరాల అధికారులతో కుమ్మక్కై ఒక్కో డీలర్‌కు 50 నుంచి 100 లీటర్ల వరకు కోత వేసి సరఫరా చేస్తున్నట్టు పలువురు డీలర్లు వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న డీలర్లకు కేటాయింపులు పెంచి వారి ద్వారా అధికారులు అందిన మేరకు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేటాయింపుపై పలువురు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా అధికారులు దాట వేస్తున్నట్టు సమాచారం. జిల్లాలో 7,82,139 మంది కార్డుదారులు ఉన్నారు.
 
 వీరిలో గ్యాస్ లేని వారికి రెండులీటర్లు, గ్యాస్ ఉన్నవారికి ఒక లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయాల్సి ఉంది. రెండులీటర్ల కిరోసిన్ కార్డుదారులు 6,41,334 మంది, లీటర్ కిరోసిన్‌దారులు 1,40,805 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా సక్రమంగా కిరోసిన్ పంపిణీ కావడం లేదు. ఫలితంగా పేదలకు కిరోసిన్ కష్టాలు తప్పడం లేదు.
 
 పెట్రోలు బంకులకు తరలుతున్న కిరోసిన్
 కొందరు హోల్‌సేల్ డీలర్లు కిరోసిన్‌ను పెట్రోలు బంకులకు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నీలి కిరోసిన్‌ను ఆయా బంకుల యజమానులు పెట్రోలు, డీజిల్‌లో నీలి కిరోసిన్‌ను కల్తీ చేస్తున్నారు. దీంతో పెట్రోలు బంకుల యజమానులు వాహనదారులను నిలువునా మోసం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. జిల్లాలో ఎక్కడా కిరోసిన్, పెట్రోలు,డీజిల్ బంకులపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఒక వేళ చేసినా నామమాత్రమే. ఇకనైనా ఉన్నతాధికారులు హోల్‌సేల్ కిరోసిన్, పెట్రోలు, డీజిల్ బంకుల అక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement