ఎవరి చేతిలో లాటీ?
*తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో చర్చోపచర్చలు
*గవర్నర్ చేతికి శాంతిభద్రతలు!
*సైబరాబాద్ పరిధిపై వీడని సందిగ్ధత
* గ్రేటర్ సరిహద్దు ఠాణాలపై సస్పెన్స్
జిల్లా అస్తిత్వానికి మరో ముప్పు ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని సంబర పడాలో.. ఉనికి దెబ్బతింటుందని బాధపడాలో తెలియని అయోమయం నెలకొంది. హైదరాబాద్ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో గవర్నరే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని ‘టీ’బిల్లులో పొందుపరచడం ఈ గందరగోళానికి తావిచ్చింది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో కొనసాగుతున్న శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలపై అన్నిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించిన జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్(పార్ట్) పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరి ధిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగిస్తే సాధారణంగానే ఈ జంట కమిషనరేట్లు ఆయన ఆధీనంలోకి వెళతాయి.
తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండే గ్రేటర్‌పై గవర్నర్ పెత్తనమేంటనిఇప్పటికే నగర ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సద్దుమణగకముందే జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా.. సైబరాబాద్ కమిషనరేట్ కూడా గవర్నర్ పరిధిలోకి వెళ్లనుంది. ఈ మేర కు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’లో పొందుపరిచారు. వాస్తవానికి సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల గురించి బిల్లులో ప్రస్తావించనప్పటికీ, గ్రేటర్ పోలీసింగ్‌ను గవర్నరే చూస్తారని స్పష్టం చేశారు. దీంతో సహజంగానే సైబరాబాద్ కూడా ఆయన కనుసన్నల్లోకి వెళ్లిపోయినట్లుగా నిర్వచించవచ్చు.
వీటి పరిస్థితేంటి?
గ్రేటర్‌లో లా అండ్ ఆర్డర్‌ను గవర్నర్ పర్యవేక్షించనుండడంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్‌లో కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 ఠాణాలు ఆయన పరిధిలోకి వెళ్లనున్నాయి. కాగా, నగరానికి దూరంగా ఉన్న 19 పోలీస్‌స్టేషన్లు కూడా సైబరాబాద్‌లో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. వీటి పరిస్థితేంటనేది ప్రస్తుతానికి అంతు చిక్కడంలేదు. 2003 మే ఐదో తేదీన సైబరాబాద్ కమిషరేట్ ఏర్పడింది. అప్పటివరకు రంగారెడ్డి ఎస్పీ పేరిట మొత్తం జిల్లా అంతా కొనసాగేది. సైబరాబాద్ ఏర్పడిన తర్వాత.. రంగారెడ్డి గ్రామీణ పేరిట వికారాబాద్ హెడ్‌క్వార్టర్‌గా కొత్త ఎస్పీ ఆఫీస్‌ను ప్రారంభించారు. దీని పరిధిలోకి చేవెళ్ల మొదలు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల వరకు గల 20పోలీస్‌స్టేషన్లను కలిపారు.
ఈ క్రమంలోనే సైబరాబాద్ పరిధిలో నగర శివారు ప్రాంతాలను చేర్చారు. వైట్ కాలర్ నేరాలు పెరగడం, వీఐపీల రాకపోకలు, ఐటీ, బహుళ జాతి సంస్థల తాకిడి పెరగడంతో సైబరాబాద్ కమిషనరేట్‌కు అంకురార్పణ జరిగింది. నక్సల్ ప్రభావితం గల మంచాల, యాచారం మొదలు.. అంతర్జాతీయ విమానాశ్రయం గల శంషాబాద్ ఠాణాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. భౌగోళికంగా గ్రేటర్ అవతల ఉన్న సుమారు 19 పోలీస్‌స్టేషన్ల భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వీటి ని కూడా గవర్నర్ చెంతనే ఉంచుతారా? లేక వీటితో కొత్త కమిషనరేట్/రంగారెడ్డి అర్బన్ పేరిట నూతన శాఖను ఏర్పాటు చేస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.
ఒకవేళ సైబరాబాద్‌ను పూర్తిస్థాయిలో గవర్నర్ పరిధిలోకి తెస్తే మాత్రం ఠాణాలపై రాజకీయ జోక్యం తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రజాప్రతినిధుల పెత్తనం కూడా తగ్గనుంది. మరోవైపు గ్రేటర్ సరిహద్దులోని సైబరాబాద్ పోలీస్‌స్టేషన్లను ప్రస్తుతం వికారాబాద్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిధిలోకి కలపాలని భావిస్తే శివారు ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న జిల్లా కలెక్టరేట్‌ను షిఫ్ట్ చేసేందుకు అంగీకరించని ప్రజాప్రతినిధులు.. గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టే అంశాన్ని ప్రతిఘటించే అవకాశంలేకపోలేదు. అంతేకాకుండా హోంశాఖ కీలక భావించే ఇరు కమిషనరేట్లు గవర్నర్ కనుసన్నల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వంలో హోంమంత్రికి ఇప్పుడున్నంత ప్రాముఖ్యత ఉండే అవకాశాలు తక్కువే.
సైబరాబాద్ పరిధిలోని గ్రేటర్ బయట పోలీస్‌స్టేషన్లు ఇవీ
శంషాబాద్, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పహాడీషరీఫ్, మొయినాబాద్, నార్సింగ్, కీసర, ఘట్‌కేసర్, మేడిపల్లి, మేడ్చల్, శామీర్‌పేట, దుండిగల్, మీర్‌పేట, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మహేశ్వరం, కందుకూరు.