రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఇక గ్రేటర్ హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సిటీజనుల్లో ఇదే విషయమై సర్వత్రా విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో సుమారు 625 చదరపు కిలోమీటర్లు, 78 లక్షల మంది జనాభాతో ‘గ్రేటర్’ ఉంది. ఇక శాంతిభద్రతలను పరిరక్షించే అంశం గవర్నర్‌కు కట్టబెట్టడంతో భద్రత, ఉపాధి, ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య, వృత్తి విద్య తదితర అంశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
సాక్షి, సిటీబ్యూరో :
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఉమ్మడి రాజధానిపై పడింది. జీహెచ్‌ఎంసీ పరిధి వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. విభజన జీహెచ్‌ఎంసీ, జలమండలి వంటి స్థానిక సంస్థల విభాగాల్లో రోజువారీ పరిపాలనా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నది నిపుణుల మాట. ఇక నగరంలో కొలువైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయం, ఆయా విభాగాల డెరైక్టరేట్లు, క మిషనరేట్లు సహా సుమారు 105 సర్కారు కార్యాలయాల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకే ప్రాంగణంలో ఉన్న కార్యాలయాలను వీలును బట్టి బ్లాకుల వారీగా రెండుగా విభజించి ఉభయరాష్ట్రాల్లో పాలన సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. అలా వీలుకాని పక్షంలో నగరంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో సీమాంధ్ర రాష్ట్ర కార్యాలయాలను పదేళ్లపాటు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా విభ జన అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి గ్రేటర్ నగరం భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వ్యక్తమయిన విషయం విదితమే.
నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారా.. లేక గవర్నర్ పాలకమండలి చేతిలో పెడతారా.. చండీగఢ్ తరహా పాలన అమలు చేస్తారా.. అన్న అంశంపై చర్చోపచర్చలు సాగాయి. ఒక దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలతో ప్రత్యేక శాసనసభ ను ఏర్పాటు చేస్తారన్న పుకార్లూ షికారు చేశాయి. అనేక తర్జనభర్జనల అనంతరం కేంద్రం ఈ సస్పెన్స్‌కు మంగళవారం లోక్‌సభలో తెర దించింది. మొదట్లో అనుకున్నట్లుగానే గ్రేటర్ పరిధిని ఉమ్మడిగా ప్రకటించింది. ఉమ్మడి రాజధానిగా గ్రేటర్‌ను ప్రకటించిన నేపథ్యంలో మహానగర విశేషాలపై ప్రత్యేక కథనం..
మెట్రోల్లో ఆరు.. జనాభాలో నాలుగు..
దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది.
అతిపెద్ద మెట్రో ముంబై కాగా.. తర్వాతి స్ధానాల్లో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలు నిలిచాయి.
జనాభాలో మాత్రం నాలుగో స్థానం ఉంది.
అత్యధిక జనాభా ఉన్న నగరంగా ముంబై నిలవగా.. తర్వాతి స్ధానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి.
78,00,000 జనాభాతో హైదరాబాద్ నాలుగో స్థానం దక్కించుంకుంది.
అత్యధిక జన సాంద్రత గల నగరాల సరసన చేరింది.
పారిశ్రామికీకరణ..
నగరానికి ఆనుకొని ఉన్న శివార్లలో సుమారు 20 వేల వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, తయారీరంగ ం, నిర్మాణ రంగ, మెటల్ పరిశ్రమలు విస్తరించడంతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి.
వీటితోపాటే సేవలు, వాణిజ్యరంగాలు విస్తరించడంతో ఉపాధి కోసం ప్రధాన నగరం నుంచి శివార్లకు తరలివెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు, పొరుగు జిల్లాల నుంచి నిత్యం వలస వస్తున్న కార్మికులు, దినసరి కూలీలు, సాఫ్ట్‌వేర్, బీపీఓ ఉద్యోగులతో నగర శివార్లు కిటకిటలాడుతున్నాయి.
ఉన్నత విద్యకు చిరునామా
మేడ్చల్, ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వందలాదిగా ఇంజనీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్ వృత్తి విద్యా కళాశాలలున్నాయి.
ఫలితంగా ఇక్కడ ఉన్నత విద్యావకాశాలు బాగా పెరిగాయి.
కళాశాలల్లో కూడా ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి.
ఫలితంగా శివార్లు కిటకిటలాడుతున్నాయి.
జీహెచ్‌ఎంసీ స్వరూపమిదీ...
జీహెచ్‌ఎంసీ.. గతంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)గా ఉండేది. శివార్లలోని 12 మునిసిపాలిటీల విలీనంతో 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అవతరించింది. రంగారెడ్డి జిల్లాలోని 10 మునిసిపాలిటీలు, మెదక్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలను కలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ స్వరూప స్వభావాలిలా ఉన్నాయి.
జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్
అసెంబ్లీ స్థానాలు: 24 (పటాన్‌చెరు (పార్ట్), మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ (పార్ట్), కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీ నగర్, మహేశ్వరం (పార్ట్), రాజేంద్రనగర్ (పార్ట్), శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్ట్ ).
పార్లమెంట్ స్థానాలు: హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలు మాత్రమే పూర్తిగా దీని పరిధిలోకి రాగా, మల్కాజిగిరి, చేవేళ్ల, మెదక్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి.
పరిపాలన: జీహెచ్‌ఎంసీ స్థానిక పాలనలో మేయర్, డిప్యూటీ మేయర్‌లున్నారు. 150 మంది కార్పొరేటర్లు వీరిని ఎన్నుకున్నారు.
గడువులోగానే మెట్రో ప్రాజెక్టు
నగరంలోని ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర విభజన అంశం ఎలాంటి ప్రభావం చూపదని ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గడువులోగానే మెట్రో పనులను పూర్తిచేస్తామని తెలిపాయి.
వచ్చే ఏడాది మార్చి 22న మొదటి దశ పూర్తవుతుందన్నారు.
మెట్రో నగర పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఇక గ్రేటర్ ‘ఉమ్మడి’ రాజధాని
Published Wed, Feb 19 2014 5:11 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement