మీకు ఎంత ఆదాయం ఉందో మాకు తెలుసు. మాకు ఇస్తున్న మామూళ్లు రెట్టింపు చేయండి’ అంటూ ....
► అధికారంలో లేనప్పుడూ ఒకటే.. ఉన్నప్పుడూ ఒకటేనా
► మామూళ్లు పెంచకపోతే కుదరదంతే..
► సీఎం పర్యటనకు భారీ ఖర్చవుతోంది
► మీరు సాయం చేయకుంటే ఎలా..?
► కొడికొండ చెక్‌పోస్టులో టీడీపీ నేతల హల్‌చల్
హిందూపురం అర్బన్:‘ మీకు ఎంత ఆదాయం ఉందో మాకు తెలుసు. మాకు ఇస్తున్న మామూళ్లు రెట్టింపు చేయండి’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెక్‌పోస్టు అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు... ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్, చిలమత్తూరు టీడీపీ నాయకులు అన్సర్, మాజీ చైర్మన్ అనిల్‌కుమార్ మరికొందరు సోమవారం రాత్రి 11.45 గంటల సమయంలో కొడికొండ చెక్‌పోస్టు వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న డ్రైవర్లతో చెక్‌పోస్టులో ఎంత మమాళ్లు ఇస్తున్నారని విచారించారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి ప్రతినెలా పంపించే మొత్తాన్ని (ముడుపులు) రెండింతలు చేయాలని రువాబు చేశారు. అధికారంలో లేనప్పుడూ ఒక్కటే ఉన్నప్పుడు ఒకటేనా.. ఇకపై అదేం కుదరదన్నారు. ముఖ్యంగా సీఎం పర్యటనకు వాహనాలు, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వాటికోసం కొంత ఆర్థిక సాయం అందించాలని దబాయించారు.
డ్యూటీలోని అధికారులు తమకు అంత ఆదాయం లేదని చెప్పడంతో ‘మాకు అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలా? ఇక నుంచి మాములు పెంచకపోతే అంతే..’ అని హెచ్చరించారు. ఇదంతా చెక్‌పోస్టులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనిని అక్కడ డ్యూటీలో ఉన్న అధికారులు ఉన్నతాధికారులకు పంపించినట్లు విశ్వనీయసమాచారం. ఈ వ్యవహారంపై డీసీటీవో నరసింహులును వివరణ కోరగా.. ‘ఎమ్మెల్యే పీఏ, ఇతర నాయకులు వచ్చింది నిజమే..వారు బయట డ్రైవర్లతో మాట్లాడారు. తర్వాత ఆఫీసులో కొంతసేపు ఉండి వెళ్లిపోయారు. అది నేను సీసీ ఫుటేజిలో చూశాన’ని చెప్పారు. మామూళ్ల గురించి ఎటువంటి ప్రస్తావనా రాలేదని వివరణ ఇచ్చారు. అలాగే ఏఓ రాజును అడుగగా నాయకులు వచ్చారని, అయితే తాను ఆ సమయంలో డ్యూటీలో లేనన్నారు.