టూరిజం ప్రాజెక్టులకు సీఎంతో ఎంవోయూ కుదుర్చుకుంటున్న ప్రతినిధులు
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని 2022 నాటికి దేశంలో మూడో రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. మరే రాష్ట్రంలోనూ లేని అపార వనరులు ఏపీలో ఉన్నాయని, పెట్టుబడిదారులు ముందుకొస్తే అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం విశాఖలో ప్రారంభమైన పారిశ్రామిక భాగసామ్య సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు.
మూడు వారాల్లో అనుమతులు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి అన్ని రకాలుగా సహకరిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించి ఏవైనా భూ వివాదాలు తలెత్తినా తామే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎలాంటి అనుమతులైనా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఉన్నాయని, భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీల ధర కూడా తగ్గిస్తామన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ పారిశ్రామిక పురోభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోందన్నారు. 2015–16లో 10.5 శాతం, 2016–17లో 11.61 శాతం, 2017–18 మొదటి అర్ధ సంవత్సరంలో 11.37 శాతం పురోభివృద్ధి నమోదైందన్నారు. రెండంకెల వృద్ధి సాధించడం ఏపీకే సాధ్యమైందన్నారు. సీఎం హోదాలో తాను ఆరు భాగస్వామ్య సదస్సులను నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు.
1,946 ఎంవోయూలు.. కార్యరూపం దాల్చినవి 531
గత మూడేల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి 1,946 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రూ. 13.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 31 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసినట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే 531 పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయని, రూ. 1.03 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని, 2.65 లక్షల మందికి ఉపాధి లభించిందని ప్రకటించారు. మరో 1,143 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా రూ. 5.69 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని, పారిశ్రామిక పెట్టుబడుల పురోగతి దేశంలోనే అత్యధికంగా 59 శాతం నమోదైందని చెప్పారు. మరో ఐదేళ్లలో 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. .
భావనపాడు పోర్టులో పెట్టుబడులు ..
భావనపాడు పోర్టులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అదాని గ్రూప్ చైర్మన్‌గౌతమ్ అదాని భాగస్వామ్య సదస్సులో ప్రకటించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల పరిశ్రమలతో కలుపుకొని రూ. 9,400 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫాక్చరర్స్, రాష్ట్ర ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.
వచ్చే ఏడాదీ విశాఖలోనే: సీఎం
వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఏటా సదస్సు నిర్వహించే ఏపీఐఐసీ మైదానంలో కొత్తగా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు. ఏడాదిలో నిర్మాణం పూరై్తతే తదుపరి భాగస్వామ్య సదస్సు అందులో నే ఏర్పాటు చేస్తామన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ కాంట్రాక్టు పొందిన లూలూ సంస్థ సీఎండీ యూసఫ్ ఆలీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment