‘ప్యాకేజీ’ నిధులను స్వాహా చేసేందుకే..
వీరవల్లి (హనుమాన్‌జంక్షన్ రూరల్) : ఏపీకి ప్యాకేజీ రూపంలో వచ్చే నిధులను స్వాహా చేయవచ్చు అనే ఆశతో సీఎం చంద్రబాబు ఉన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలసు పార్థసారథి అన్నారు. బాపులపాడు మండలంలోని వీరవల్లిలో యాదవుల ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో శనివారం రాత్రి ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొడెబోయిన బాబి నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
హోదాతో ఉపాధి..
కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే సంక్షేమ ప«థకాలకు నిధులు, పరిశ్రమలకు పన్ను రాయితీలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశతో వైఎస్సార్ సీపీ హోదా కోసం పొరాటం చేస్తుందని చెప్పారు. టీడీపీ నేతల జేబులు నింపేందుకే సీఎం చంద్రబాబు, ప్యాకేజీని స్వాగతిస్తుందన్నారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ డైరెక్టర్ పద్మనాభం పాల్గొన్నారు.