
ఒకటి నుంచి పరిపాలనా నగరం పనులు
సీఆర్‌డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి : నవంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతిలో పరిపాలన నగర నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న వేగం సరిపోదని, ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిన పనులు చురుగ్గా జరిగేలా చూడాలన్నారు. బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని వ్యవహారాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన నగర నిర్మాణంతోనే అసలు పనులు ప్రారంభమవుతాయని, దీని నిర్మాణంతోనే రాజధానికి ఒక రూపు వస్తుందన్నారు. కృష్ణానదిలోని ఇసుకను ఇక్కడే పూర్తిస్థాయిలో నిల్వ ఉంచాలని సీఆర్‌డీఏ తన నియంత్రణలో ఉంచుకోవాలని సీఎం సూచించారు. పెద్దఎత్తున అవసరమయ్యే సిమెంట్ కోసం రాజధానికి దగ్గర్లోనే ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు తయారీదారులకు అవకాశం కల్పిస్తామన్నారు.