బాబుదే బాధ్యత | cm chandrababu is responsible for law and order | Sakshi
Sakshi News home page

బాబుదే బాధ్యత

Published Mon, Aug 25 2014 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బాబుదే బాధ్యత - Sakshi

బాబుదే బాధ్యత

రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

శాంతిభద్రతల క్షీణతపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

కడప అగ్రికల్చర్: రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప ఇందిరా భవన్‌లో నియోజకవర్గ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ  ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
 
ఇటీవల విజయవాడలో  కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తే కుదరదు మా పార్టీ  ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు విలువ ఇచ్చి వారికి సాయపడితేనే మేం ఉంటాం, లేకపోతే మీకు ఇబ్బంది, మాకూ ఇబ్బంది, చివరకు మీరు అగచాట్లు పడాల్సి వస్తుందని చెప్పడంతోనే’ రాష్ట్రంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని బహిర్గతమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే తేడా లేకుండా బరితెగించి దాడులకు దిగుతుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అధ్యక్షపాలనా అనేది అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తిని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని పదేపదే దూషిస్తుంటే ఇదేమి చట్టసభ అని జుగుప్స కలుగుతోందన్నారు.
 
వైఎస్ పరిపాలన సమయంలో వైఎస్సార్ జిల్లాలో ఒక్క సంఘటనైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు వైఎస్ ఉన్నప్పుడు సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అప్పుడేమైనా పార్టీ చచ్చిపోయిందా లేక ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయా అని నిలదీశారు. డబ్బు సంచులు మోసిన వారికి, బ్రోకర్లకు, రాజకీయమనే గంధపు వాసన కూడా చూడని వారికి సీట్లిచ్చి వారిని అందలమెక్కించారే మరి మైనార్టీలకు ఒక్క మంత్రి పదవైనా ఎందుకు ఇవ్వలేదని సీఎంను అడిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీ పీలో చేరినవారికి గన్‌మెన్‌లు, మంది మార్బలాన్ని ఇచ్చారే మిగతా పార్టీలకు చెందిన నాయకులకు ఎందుకు గన్‌మెన్‌లను తొలగిస్తున్నారో సీఎం జవాబు చెప్పాలన్నారు. పదేళ్ల క్రితం తాము కూడా ఇలా ఆలోచించి ఉంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా మిగిలేవారు కాదన్నారు.
 
కరువు పరిస్థితులు ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాబు వస్తే.. జాబు వస్తుందని చెప్పారు. ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలను పీకే స్తూ ఆదర్శ రైతులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు చంద్రబాబు జాబు(ఉత్తరం) రాశారని ఎద్దేవా చేశారు. పార్టీని గ్రామ, మండల, పట్టణ, నగర, రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ జతకట్టి మారణకాండను సృష్టించే భయానక పరిస్థితులను తీసుకువస్తోందని ఆరోపించారు. మరో మూడు నెలల్లో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జోస్యం చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో  కేంద్ర మాజీ మంత్రి ఎ. సాయిప్రతాప్, డీసీసీ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్, జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్, సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు, జిల్లా పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు బండి జకరయ్య, డీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, నగర అధ్యక్షుడు చింతకొమ్మదిన్నె సుబ్బరాయుడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దర్గాషాషావలి, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సత్తార్, చంద్రశేరరెడ్డి, ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర కన్వీనర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ జోజప్ప, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
కార్యకర్తలను పట్టించుకోండి
కడప అగ్రికల్చర్ : పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని, కార్యకర్తలు పార్టీకి బలమన్న సంగతి నేతలు మరిచారని, కార్యకర్తలను పట్టించుకోండని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నినదించారు. ఆదివారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొదట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆతరువాత నిర్వహించిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, శాసనమండలిలో విపక్షనేత సి. రామచంద్రయ్య, కేంద్ర మాజీమంత్రి ఎ. సాయిప్రతాప్, ఎమ్మెల్సీ చెంగల్రాయులు, పీసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాష, సుబ్రమణ్యంలు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రాయచోటికి చెందిన కార్యకర్త ఒకరు కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కడప నియోజకవర్గ సమావేశంలో పోటీచేసి ఓటమి చవిచూసిన మగ్ధూం మౌలానా మాట్లాడుతూ తనను పార్టీలోకి తీసుకువచ్చిన వారు పార్టీకి ద్రోహం చేసి టీడీపీకి మద్దతు పలికి ఓటు బ్యాంకుకు గండికొట్టారని అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. కడప నగరంలో పార్టీకి ఓటు బ్యాంకు ఉందని, దాన్ని గత ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోలేక పోయామని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దర్గాషాషావలి అన్నారు.
 
 అసమర్థుల నాయకత్వంలో పనిచేయలేమని, సమర్థుడైన నాయకుడి కింద పనిచేసేందుకు సిద్ధమని చెబుతుండగా రఘువీరా జోక్యం చేసుకుని స్థానికంగా ఉన్న మీరే కుర్చొని నాయకుడిని నిర్ణయించుకుంటే బాగుంటుందన్నారు. ఆ తరువాత నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఈ అంతర్గత సమీక్షలో డీసీసీ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు ఎస్. నజీర్ అహ్మద్, మాజీ మంత్రి అహ్మదుల్లా, అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సూచనలు,సలహాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement