
సాక్షి, అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని సీఎం ట్వీట్ చేశారు. (చదవండి : అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్.. )
పలాసలో ట్రూనాట్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీతో తరలిస్తున్న దృశ్యం
ఏం జరిగిందంటే...
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు.ఉన్నతాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది. పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment