palasa kasibugga
-
అఖండ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో చెలరేగిన మంటలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మునిసిపాలిటీలోని రవిశంకర్ థియేటర్లో అఖండ సినిమా ప్రదర్శన సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సినిమా కొనసాగుతుండగా తెర వెనుక ఉన్న సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. -
‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్: కేక్ కట్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ): సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ ప్రజలు ఆదరించి భారీ కలెక్షన్లు పంపేవారన్నారు. ఇప్పుడు పలాస ప్రాంతానికి చెందినవారే సినిమాలు తీయడం సంతోషకరమన్నారు. శుక్రవారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విడుదల సందర్భంగా పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలాస మండలంలో మారుముల కంట్రగడ గ్రామంలో పుట్టిపెరిగిన కరుణ కుమార్ ‘పలాస–1978’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై రికార్డు సృష్టించారన్నారు. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులు ఈ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో పలాసకు కళ వచ్చిందన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలియజేశారు. చిత్రంలో నటించిన నటులు మంత్రి అప్పలరాజును సత్కరించారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి ఉన్నారు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
ప్రాణం ఉండగానే పసికందు పూడ్చివేత?
-
ఈ పాపం ఎవరిది.. ప్రాణం ఉండగానే పసికందు పూడ్చివేత?
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ ): అమ్మ గర్భగుడి దాటిన ఓ పసిపాపకు లోకం శాపం విసిరింది. ఏ వైద్యుడు పరీక్షించాడో, ఏమని రిపోర్టు ఇచ్చాడో గానీ కళ్లయినా తెరవని బుజ్జాయిని కొన ప్రాణంతో ఉండగానే కాటికి పంపించేశారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పాపాయిని గుడ్డ ముక్కలతో చుట్టి మట్టిలో పాతి పెట్టాలని పురమాయించారు. పలాసలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి వర్గాలు చనిపోయిన బిడ్డను పాతిపెట్టేయాలని కొందరికి పని అప్పగించారు. వారు గొయ్యి తవ్వుతుండగా బిడ్డ కదలడం చూసి ఆశ్చర్యపోయారు. . ఏం చేయాలో తెలీని స్థితిలో అలాగే ఉండిపోయారు. ఆ కాసేపు పెనుగులాట తర్వాత బిడ్డ కూడా కదలడం మానేసింది. దీంతో వారు కూడా చేసేదేమీ లేక చనిపోయిందని నిర్ధారించుకుని పూడ్చిపెట్టారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులంతా ఆస్పత్రి తీరుపై మండిపడుతున్నారు. -
ఆ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : సీఎం జగన్
సాక్షి, అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని సీఎం ట్వీట్ చేశారు. (చదవండి : అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్.. ) పలాసలో ట్రూనాట్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీతో తరలిస్తున్న దృశ్యం ఏం జరిగిందంటే... శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు.ఉన్నతాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది. పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు. -
హృదయ విదారకం..
కాశీబుగ్గ: పదమూడు మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం వారిది. అప్పటి వరకు కలిసిమెలిసి జీవనం సాగించిన ఆ కుటుంబంలో కోవిడ్–19 వైరస్ చిచ్చు రేపింది. వారి అనుబంధాల్ని, ఆప్యాయతల్ని ప్రశ్నించింది. కరోనా వైరస్ పాజిటివ్‌తో ఆ కుటుంబ పెద్ద మృతి చెందితే... ఏం చేయాలో పాలుపోక.. మృతదేహం దగ్గరికి వెళ్లడానికే భయపడ్డారు. అప్పటివరకు స్నేహాన్ని పంచిన ఆ పెద్దాయన్ని చూసేందుకు కాలనీవాసులూ వెనుకంజ వేశారు. మరోవైపు.. మృతదేహాన్ని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో తరలించడాన్ని చూసి వారి హృదయం తల్లడిల్లింది. ఈ హృదయవిదారక సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే... శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన రాజమ్మకాలనీలో శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకు అంత్యక్రియలకు ముందు వైద్యాధికారులు మృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించి అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్ల ద్వారా కరోనా ట్రూనాట్ పరీక్షలు నిర్వహించారు. అప్పటివరకు కలివిడిగా... సంప్రదాయం ప్రకారం మృతదేహానికి అంత్యక్రియలకు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు పూర్తి చేశారు. మృతదేహాన్ని ఒక కిలోమీటరు దూరంలో ఉన్న స్థానిక శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా వైద్యులు ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని తెలిపారు. అంతే... అప్పటివరకు కలివిడిగా ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు, కాలనీవాసులు సహా అక్కడి నుంచి భయంతో పరుగులు పెట్టారు. నడిరోడ్డుపై మృతదేహాన్ని విడిచి వెళ్లిపోయారు. జేసీబీతో తరలింపు... వైద్య, రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు సంఘటన ప్రాంతానికి వచ్చిన మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీకి చెందిన జేసీబీతో శ్మశానానికి తరలించారు. ఉన్నతాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది. బాధ్యులపై చర్యలు పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు. -
పట్టపగలే దొంగలు బీభత్సం
-
వీడియో వైరల్: వెంబడించి మరీ లాక్కెళ్లారు
సాక్షి, పలాస/శ్రీకాకుళం: జిల్లాలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. వివరాలు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని రోటరీనగర్‌కు చెందిన ఉషారాణి శుక్రవారం సాయత్రం తమ ఇంటివైపు నడుచుకుంటు వెళ్తుండగా వెనకే వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారయ్యారు. దొంగతనం అడ్డుకునే క్రమంలో ఉషారాణికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్నామనీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రూ.43 వేలు విలువైన గుట్కా పట్టివేత
పలాస : పలాస రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.43 వేల విలువైన గుట్కాను కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పలాస–కాశీబుగ్గ పట్టణంలో పలువురు వ్యాపారులు బరంపురం నుంచి వివిధ రైళ్లు, బస్సు మార్గాల ద్వారా అక్రమంగా గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే విషయమై ‘అక్రమంగా గుట్కా వ్యాపారం’ పేరుతో ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు గుట్కా వ్యాపారులపై నిఘా పెట్టారు. నెహ్రూనగర్‌లోని అంబికా టింబర్ సమీపంలో ఒక గొడౌన్లో అక్రమంగా గుట్కాను నిల్వ చేసి ఉంచుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దృష్టి సారించారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి వస్తున్న సరుకులపైనా నిఘా ఉంచారు. బుధవారం కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద పోలీసులు సరుకులను పరిశీలిస్తుండగా గుట్కా బస్తాలు బయటపడ్డాయి. వ్యాపారి పెద్దిన హరీష్‌ను అరెస్టు చేయడంతో పాటు గుట్కాను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.43 వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గుట్కాను పట్టుకున్న వారిలో కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్ఐ బి.శ్రీరామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు.