వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఇతరులు ఇన్‌సెట్లో సీఎం జగన్
జిల్లాతో ఆయన అనుబంధం అనిర్వచనీయం. దాదాపు నెలా పదిరోజులు... తొమ్మిది నియోజకవర్గాలు... వందలాది కిలోమీటర్లు... లక్షలాది అభిమానులు... ఇదీ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సంక్షిప్త స్వరూపం. అందరి వేదనలు తెలుసుకున్నారు... బాధలు పంచుకున్నారు. కష్టాలు కళ్లారా చూశారు. కన్నీళ్లు తుడిచారు. నేనున్నానంటూ భరోసా కలి్పంచారు. గద్దెనెక్కిన ఎనిమిది నెలలకే ఎన్నో చేశారు. మరో నాలుగేళ్లలో మరెన్నో చేయబోతున్నారు. అలాంటి నేత మళ్లీ వస్తున్నారంటే జిల్లావాసులకు పండగే కదా. ఆ తరుణం మరికొద్దిరోజుల్లోనే రానుంది. ఈ నెల 24న జిల్లాకు వస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు.
సాక్షి విజయనగరం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24న జిల్లాకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని విజయనగరం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంగళవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు జగన్. పాదయాత్ర తర్వాత ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు తొలిసారి రానున్నారు.
రాష్ట్రంలో 11,87,904మందికి ప్రయోజనం
రాష్ట్రంలో 11,87,904 మంది విద్యార్థులు ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న 153 కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన 58,091 మంది విద్యార్ధులకు మేలు జరగనుంది. డిగ్రీ ఆపై చదువులు చదివే వారికి ఏడాదికి రూ.20 వేలు రెండు విడతల్లో చెల్లిస్తారు. ఫిబ్రవరిలో రూ.10 వేలు, జూలైలో రూ.10 వేలు వంతున విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఐటీఐ చదువుతున్న వారికి మొత్తం రూ.10 వేలుకాగా, తొలివిడతగా రూ.5000 అందజేస్తారు. పాలిటెక్నిక్ చదివే వారికి మొత్తం రూ.15 వేలు కాగా, తొలివిడతగా రూ.7500 చెల్లించనున్నారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
18న కంటివెలుగు మూడోవిడత ప్రారంభం
కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని అవ్వా–తాత పేరుతో చేపడుతున్నామని, ఈ నెల 18న కర్నూలులో ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 56 లక్షల మంది వృద్ధులకు కంటి తనిఖీలు చేపడతామన్నారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులకూ అదేరోజున శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్రంలో 4906 ఆరోగ్య ఉపకేంద్ర భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని విడతల వారీగా చేపడతామని, విజయనగరం జిల్లాలో మార్చి 25 నుంచి కార్డుల పంపిణీ వుంటుందన్నారు. బియ్యం కార్డుల పంపిణీ ఫిబ్రవరి 15 నుండి చేపడతారని చెప్పారు. అర్హులు ఎవ్వరికీ బియ్యం కార్డు అందలేదనే మాటే వినిపించకూడదని అధికారులకు స్పష్టంచేశారు. కార్డుల పునఃపరిశీలన ఈ నెల 18 నాటికి పూర్తిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి నిరుపేదకూ ఇళ్ల పట్టా అందించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.
రచ్చబండ కార్యక్రమంలో తాను అడిగినపుడు ఏ ఒక్కరూ తనకు అర్హత వున్నా ఇంటిపట్టా అందలేదని ఫిర్యాదుచేసే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో జిల్లా కలెక్టర్‌లు శ్రద్ధ చూపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో పార్వతీపురం నుంచి పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డిని జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న పనులపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వైద్య కళాశాల కోసం ఉద్దేశించిన స్థలాన్ని పరిశీలించేందుకే తాను వచ్చానని ముఖ్య కార్యదర్శి వివరించారు. జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, ఎస్పీ బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్–2 ఆర్.కూర్మనాథ్, అదనపు ఎస్పీ శ్రీదేవిరావు, డీఆర్‌ఓ జె.వెంకటరావు, జిల్లాపరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సునీల్ రాజ్‌కుమార్, గృహనిర్మాణ సంస్థ పీడీ ఎస్.వి.రమణమూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు, డీఈఓ నాగమణి, డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment